
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ శనివారం రాష్ట్రబంద్‌ను నిర్వహిస్తోంది. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు డిపోల వద్ద నిలిచిపోయాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు బస్ డిపోల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు.. ఆసుపత్రులు, మందుల దుకాణాలకు మినహాయింపు ఉంటుందని బీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
అయితే, పండుగ వేళ కావడం, వరుస సెలవులు రావడంతో ప్రయాణీకులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. ఎంజీబీఎస్‌లో బస్సులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో, సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు, జేబీఎస్, హయత్‌నగర్, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, ఉప్పల్, నగర శివారుల నుంచి బస్సులు లేకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి వరకు పలు జిల్లాల నుంచి నగరానికి బస్సులు వచ్చాయి. అలాగే, సిటీ నుంచి బస్సులు వెళ్లాయి. దీంతో, ఆ బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. మరోవైపు.. రైళ్ల రాకపోకలు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో కాలేజీలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్ర బంద్ నేపథ్యంలో శనివారం ఓయూలో జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.