
నిర్వహణ షెడ్యూల్ తెలియజేయాలన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వివరాలను తమ ముందు ఉంచాలని జీపీ, ఈసీ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. దీనికి రెండు వారాలు సమయమిస్తూ, విచారణను వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల మండలం లక్సెట్టిపేట్‌కు చెందిన రేంక సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రిజర్వేషన్లపై పిటిషన్ నేపథ్యంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ నిలిపివేస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పష్టత వచ్చినా ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి’అని కోరారు.
ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు, షెడ్యూల్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం తరఫున షాజియా పర్వీన్ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ అవసరం లేదని, ఎన్నికల తేదీలు తెలియజేస్తే చాలని స్పష్టం చేస్తూ, విచారణను వాయిదా వేసింది.