
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జీవో నెంబర్ 9పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు నిరాకరించింది. గురువారం వాడి వేడి వాదనల అనంతరం.. తమ తీర్పుతో హైకోర్టు విచారణపై ప్రభావం పడొచ్చని, ఈ దశలో పిటిషన్‌ను స్వీకరించబోమని చెబుతూ ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలే చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆ జీవోపై స్టే విధిస్తూ.. విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈలోపు రిజర్వేషన్ల పరిమితి మీరకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది కూడా. అయితే..
42 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఇవాళ పరిశీలించింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలంది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టులో విచారణ యధాతథంగా కొనసాగుతుందని.. అక్కడే తేల్చుకుని రావాలని పిటిషనర్ తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది.
వాదనలు ఇలా..
తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయి. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించాం. డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాం. గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు. రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది

డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించింది. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాం. బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచాము. ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాం. సమగ్రంగా , సాంకేతికంగా సర్వే జరిపాం. అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపైన స్టే ఎలా విధిస్తారు ?. హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు. వెంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది
బెంచ్ జోక్యం చేసుకుని.. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా ? అని ప్రశ్నించింది.
ప్రతివాది మాధవరెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ఏరియా ,గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉంది. జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించింది. మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించింది. 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదు అని అన్నారు.