
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న తదితరులు
ఛత్తీస్‌గఢ్‌లో ఆశన్నతో సహా 210 మంది మావోయిస్టుల లొంగుబాటు
వారిలో 111 మంది మహిళలు..
19 ఏకే–47లు సహా 153 ఆయుధాల అప్పగింత
జనజీవనంలోకి ఆహ్వనం... రాజ్యాంగ ప్రతుల అందజేత
బస్తర్ జిల్లాలోని జగ్‌దల్‌పూర్‌లో పోలీసుల సమక్షంలో కార్యక్రమం
వర్చువల్‌గా పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్‌సాయి, హోంమంత్రి
లొంగిపోవాలనుకొనే మావోయిస్టులు తనను సంప్రదించాలన్న ఆశన్న
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశ సాయుధ విప్లవ చరిత్రలోకెల్లా మావోయిస్టుల అతిపెద్ద లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌లో నమోదైంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సహా 210 మంది మావోయిస్టులు శుక్రవారం లాంఛనంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 111 మంది మహిళలు, 99 మంది పురుషులు ఉన్నారు.
వారందరిపై కలిపి రూ. 9.18 కోట్ల రివార్డు ఉంది. హోదా పరంగా చూస్తే లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, నలుగురు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఒక రీజనల్ కమిటీ సభ్యుడు, 21 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 61 మంది ఏరియా కమిటీ సభ్యులు, 22 మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులతోపాటు 98 మంది పార్టీ సభ్యులు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా 19 ఏకే–47లు, 17 ఎస్‌ఎల్‌ఆర్‌లు, 23 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ లైట్ మెషీన్ గన్, 36 (.303 రకం) రైఫిళ్లు, 11 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, నాలుగు కార్బైన్లు తదితర ఆయుధాలను అప్పగించారు. బస్తర్ జిల్లా కేంద్రమైన జగ్‌దల్‌పూర్‌లోని పోలీస్ లైన్‌లో ఉన్నతాధికారుల సమక్షంలో ‘పున మార్గ్’పేరిట ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి, హోంమంత్రి విజయ్‌శర్మ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టులకు స్థానికంగా ఉన్న మాంజీ చాల్కీ తెగకు చెందిన నాయకులు గులాబీ పూలు అందించి జనజీవన స్రవంతిలోకి ఆహ్వనించారు. ఆ తర్వాత వారికి దేశ రాజ్యాంగ ప్రతులు అందచేశారు.
ఈ సందర్భంగా సీఎం విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ సాయుధ పోరాటాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో తాజా లొంగుబాట్లు కీలక మలుపుగా నిలుస్తాయన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నట్లుగా 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ఉద్ఘాటించారు. అంతకు ముందు అడవిని వీడి గురువారం రాత్రి జగ్‌దల్‌పూర్ చేరుకున్న మావోయిస్టులను ప్రత్యేక బస్సుల్లో పోలీస్‌లైన్ వరకు తీసుకొచ్చారు.
మారిన పరిస్థితులతోనే....
అనంతరం ఆశన్న మీడియాతో మాట్లాడుతూ మారిన పరిస్థితుల కారణంగానే లొంగిపోయామని చెప్పారు. ప్రస్తుతం విప్లవకారులకు అడవుల్లో ఆశ్రయం పొందే వీల్లేని పరిస్థితి నెలకొందని.. కానీ తమ సహచరులు ఇంకా అజ్ఞాతంలో ఉంటూ సాయుధ పోరాటం చేయాలనే దృక్ఫథంతో ఉన్నారని తెలిపారు. అందులో ఎవరైనా జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే ఫోన్‌లో తనను సంప్రదించాలని సూచించారు.
అబూజ్‌మాడ్ ఖాళీ
పోలీసు వర్గాల అంచనా ప్రకారం దేశంలో మావోయిస్టు ఉద్యమానికి దండకారణ్యం ప్రధాన స్థావరంగా ఉంది. ఇందులో ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్‌మాడ్ అడవులు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉండేవి. కానీ మల్లోజుల, ఆశన్న బృందాల లొంగుబాట్లతో అబూజ్‌మాడ్‌లో ఆ పార్టీ పట్టు కోల్పోయినట్టయింది. అయితే ఇప్పటికీ దట్టమైన అడవితోపాటు ఇంద్రావతి నేషనల్ పార్క్, తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ బస్తర్ డివిజన్లలో మావోయిస్టుల ప్రభావం ఉంది. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక 477 మంది మావోయిస్టులు మృతిచెందగా 1,785 మంది అరెస్టయ్యారు. అలాగే 2,110 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
లొంగిపోయిన మావోయిస్టుల్లో ముఖ్యులు
1) తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న – కేంద్ర కమిటీ సభ్యుడు
2) భాస్కర్ అలియాస్ రాజ్‌మన్ – డీకేఎస్‌జెడ్‌సీ
3) రాణిత – డీకేఎస్‌జెడ్‌సీ
4) రాజు సలాం – డీకేఎస్‌జెడ్‌సీ
5) దన్నువెట్టి అలియాస్ సంతు – డీకేఎస్‌జెడ్‌సీ
6) రతన్ ఎలాం – రీజనల్ కమిటీ సభ్యుడు