సాక్షి, హైదరాబాద్: సన్న బియ్యం తిన్నగా లబ్ధిదారులకే చేరాలి. లేదంటే.. మూడోకన్ను ఉంది జాగ్రత్త! విజి‘లెన్స్’ఫోకస్‌కు చిక్కితే ఇక అంతే! బియ్యం బదులుగా అక్రమంగా నగదు బదిలీ ఇక సాగదు! మహా హైదరాబాద్ పరిధిలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంపై పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. రేషన్ డీలర్లు సన్న బియ్యాన్ని బహిరంగంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తుండటంతో ప్రత్యేక బందాలను రంగంలోకి దింపింది. అక్రమాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం కొన్ని నెలలుగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం మాదిరిగానే సన్నబియ్యం విషయంలోనూ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా ఈ బియ్యాన్ని మిల్లర్లకు అక్రమంగా సరఫరా చేసి డీలర్లు లాభాలు ఆర్జించడం సర్వసాధారణమైంది.
బాహాటంగా నగదు...
రేషన్ షాపుల్లో ఉచిత సన్నబియ్యం బదులు బాహాటంగా నగదు పంపిణీ సాగుతోంది. లబ్ధిదారుల సమ్మతితోనే నగదు పంపిణీ చేస్తుండటంతో వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. డీలర్లు కిలో బియ్యానికి రూ. 11 నుంచి 14 వరకు అందజేస్తున్నారు. ఆ తర్వాత ఆ బియ్యం స్టాక్‌ను బ్లాక్ మార్కెట్‌కు చేరవేస్తున్నారు.రేషన్‌కార్డులోని సభ్యుల(యూనిట్)కు ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోంది. కొందరు కార్డుదారులు ఇడ్లీ, దోసల కోసం ఒకటి రెండు యూనిట్ల కోటా బియ్యం తీసుకొని మిగతా యూనిట్ల కోటాకు సంబంధించి బియ్యం బదులు నగదు పుచ్చుకుంటున్నారు. లబ్ధి కుటుంబాలు మొత్తం కోటా డ్రా చేస్తున్నట్లు బయోమెట్రిక్‌పై వేలిముద్ద పెడుతున్నారు. తూకంపై మాత్రం మొత్తం యూనిట్లకు కోటా బరువు పెట్టి తీసేయడం బాహాటంగా సాగుతోంది. మరోవైపు డీలర్లు ఉచిత బియ్యం పంపిణీలో సరికొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. పీడీఎస్ ట్రక్కులకు అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌లతో ట్యాంపరింగ్ చేయడం, స్థానిక అధికారులతో కుమ్మక్కు, రికార్డులు ఫాల్సిఫై చేయడం వంటి అక్రమాలు ఇటీవల బయటపడ్డాయి.
ఇక రేషన్ షాపుల అకస్మిక తనిఖీ
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు వచ్చే నెల రేషన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలకు సిద్ధమవుతున్నాయి. బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన మొదటి వారంలో షాపులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్, నిల్వ స్టాక్‌ను పరిశీలించనున్నాయి. మరోవైపు డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని పౌర సరఫరాల శాఖ యోచిస్తోంది.


