‘పులిసిన అన్నం’తో ప్రయోజనాలెన్నో..
ప్రోబయోటిక్స్, పోస్ట్‌బయోటిక్స్‌ల ‘నిధి’
బాలికలు, గర్భిణుల్లో రక్తహీనతకు చెక్
చెన్నై స్టాన్లీ ఆసుపత్రి పరిశోధనల్లో వెల్లడి
రాత్రంతా మట్టి కుండలో పున్నీళ్లతో పులియబెట్టిన చద్దన్నం పొద్దున్నే తింటే మంచిదని అమ్మమ్మలు, నానమ్మలు తరతరాలుగా మనకు చెబుతూ, తినిపిస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈఅమృతాహారాన్నే ఉదయపు అల్పాహారంగా తిన్నవారే.ఇదంతా ఇప్పుడెందుకు? అంటే.. చెన్నైకి చెందిన స్టాన్లీ ఆసుపత్రి దీనిపై ఇటీవల పరిశోధన చేసి.. పులిసిన అన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రీయ వివరణ ఇచ్చింది. చద్దన్నం అని అందరూ పిలుచుకునే ఈ ఆహారానికి తెలుగునాట సద్దన్నం, సద్దికూడు, చల్దన్నం, పున్నీళ్లన్నం అని రకరకాల పేర్లు ఉన్నాయి. చద్దికుండలో పులిసిన నీళ్లను ‘తరవాణి’ అంటారు. ఈ పురాతన ఆహారం ఆరోగ్యానికి అమృతం లాంటిదని పెద్దలు చెప్పేవారు. చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజ్, అనుబంధ ఆసుపత్రి వైద్యులు దీనికి ఇటీవల శాస్త్రీయ ఆమోదం తెలిపారు. మట్టి కుండల్లో వరి అన్నాన్ని మజ్జిగ, గంజితో కలిపి పులి యబెడితే ప్రోబయో టిక్స్, పోస్ట్‌బ యోటిక్స్‌తో సహా ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయని వైద్యులు గుర్తించారు.
పొట్టలో రోగాలు మాయం!
2022లో పులిసిన అన్నంపై పరిశోధనలు చేశారు. లాక్టోబాసిల్లస్, లాక్టోకాకస్ లాక్టిస్ వంటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను; యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, న్యూరోప్రొటెక్టివ్, కార్డియో ప్రొటెక్టివ్ గుణాలు కలిగిన 200కు పైగా ప్రయోజనకరమైన మెటాబోలైట్లను పరిశోధకులు కనుగొన్నారు. ‘పులియబెట్టిన అన్నం తిన్న రోగుల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు మేం గమనించాం. ఖాళీ కడుపుతో కంజిని పరగడుపున 6 నెలలపాటు తిన్న 55 మంది రోగుల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. 13% మందికి ఉదర సంబంధ వ్యాధులు పూర్తిగా తగ్గాయి. ఒక మోస్తరు సమస్య ఉన్న వారి సంఖ్య 49% నుంచి 9%కి తగ్గింది’ అని వైద్యులు వివరించారు.
ఏయే వ్యాధులకు ఉపశమనం?
‘చద్దన్నంలోని సూక్ష్మజీవులు జీర్ణకోశ ఆరోగ్యానికి సహాయ పడ తాయి. కడుపునొప్పి, విరేచనాలు వంటివి కలిగించే ఇరిటబుల్ బౌల్ డిసీజ్, అల్సరేటివ్ కొలిటిస్ లాంటి వ్యాధుల నియంత్రణలో సహాయపడతాయి. రోజువారీ అవసరం మేరకు ఇనుము తదితర సూక్ష్మపోషకాలను అందిస్తాయి’ అని స్టాన్లీ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. కౌమార బాలికలు, గర్భిణుల్లో రక్తహీనతను నివారించడానికి చద్దాన్నాన్ని ఉదయపు అల్పాహారంగా ఇవ్వటం మేలని వీరు ప్రతిపాదిస్తున్నారు.
21 రెట్లు పెరిగిన ఇనుము!
పులియబెట్టిన అన్నం తిన్న వారిలో ఇనుము శాతం పెరిగినట్టు ఈ పరిశోధనలో తేలింది. ‘100గ్రా. అన్నంలో ఇనుప ధాతువు 3.4 మి.గ్రా. ఉంటుంది. పెరుగు, రొట్టెల తయారీలో జరిగే ప్రధా నమైన కిణ్వ ప్రక్రియ.. చద్దన్నంలోనూ జరుగుతుంది. ఆ ప్రక్రి య తర్వాత చద్దన్నంలో ఇనుము 73.91 మి.గ్రా.కు అంటే 21 రెట్లు పెరిగింది. ఇది గర్భవతులకు రోజువారీ కావాల్సిన ఇను ము కన్నా రెండింతలు అధికం’ అని వైద్యులు తెలిపారు.
ప్రయోజనాలు
∙ జీర్ణకోశ సమస్యలను తగ్గిస్తుంది
∙కడుపు నొప్పిని తగ్గిస్తుంది ∙బాలికలు, గర్భిణుల్లో రక్తహీనతను పారదోలుతుంది ∙శరీరానికి బలాన్నిస్తుంది.
ప్రోబయోటిక్స్ మ్యాజిక్
∙తరవాణి తయారుచేయాలంటే.. అన్నాన్ని మట్టి పాత్రలో మజ్జిగ, గంజితో కలిపి రాత్రంతా పులియబెట్టాలి. వేసవిలో 8–10 గంటలు లేదా శీతాకాలంలో 14 గంటల వరకు నానబెట్టాలి. ∙అన్నాన్ని రాత్రి పూట పులియ బెట్టటం వల్ల ఫైటిక్ ఆమ్లాన్ని విచ్ఛిన్నం చేయటంతో పాటు ఇనుము, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలను పెంచే మంచి బ్యాక్టీరియా సంఖ్యను వృద్ధి చేస్తుంది. ∙లాక్టిక్ ఆమ్లం, 200+ మెటాబొలైట్లు శరీర అంతర్గత వాపు (ఇన్‌ఫ్లమేషన్)తో పోరాడతాయి. యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. గుండె, మెదడును రక్షిస్తాయి.
ఇష్టంగా తాగేవారు
చద్దన్నం, తరవాణి ఆరోగ్యానికి మంచిదని తరతరాలుగా మన పెద్దలు చెబుతున్న విషయమే. అందుకే మన వాళ్లు తరవాణి పొద్దున్నే పరగడుపున ఇష్టంగా తీసుకునేవారు. పొట్ట ఆరోగ్యానికి ఇది చక్కని ఔషధం.
– డా.జి.వి.పూర్ణచందు, ఆయుర్వేద వైద్య నిపుణులు


