శాలువా తెచ్చిన తంట | Veeravanka Officials Fear Shawl Tradition After Frequent Transfers | Sakshi
Sakshi News home page

శాలువా తెచ్చిన తంట

Feb 2 2026 1:23 PM | Updated on Feb 2 2026 1:32 PM

Veeravanka Officials Fear Shawl Tradition After Frequent Transfers

వీణవంక(హుజురాబాద్‌): బదిలీపై వచ్చిన అధికారులకు,  పదోన్నతి పొందిన, ఉద్యోగ విరమణ చెందినవారికి శాలువా కప్పడం ఆనవాయితీగా వస్తుంది. కానీ, శాలువాæ కప్పితే అధికారులు ఎక్కువకాలం పని చేయడం లేదని, ఏదో ఒక కారణంతో వేటు పడుతుందనే అపవాదుపై వీణవంక మండలంలోని అధికారుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో శాలువా కప్పడం అంటేనే అధికారుల్లో వణుకు పుడుతుంది. ఇటీవల ఓ అధికారి విధుల్లో చేరారు. శాలువా కప్పడానికి పలువురు నాయకులు వెళ్లగా.. కప్పొద్దంటూ సున్నితంగా వదిలేశారు. 

అయితే ఎందుకు శాలువా కప్పొద్దంటున్నారని పలువురు ఆరా తీయగా, శాలువా కప్పుకున్న అధికారులు ఎక్కువ కాలం మండలంలో పని చేయడం లేదని, అందుకే వద్దన్నట్లు తెలిసింది. దీంతో నాయకులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. అయితే గతంలో వచ్చిన అధికారిని మండలవ్యాప్తంగా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు. సదరు అధికారిపై కొద్దిరోజులకే బదిలీ వేటు పడింది. అంతకుముందు అదే కార్యాలయంలో ఇద్దరు అధికారులు ఇదే రీతిన కొద్ది రోజులకే బదిలీకావడంతో శాలువా చర్చ తెరపైకి వచ్చింది. ఏడాదిలో నలుగురు అధికారులు ఒకే శాఖలో బదిలీ కావడంతో చర్చ జోరుగా సాగుతోంది. ఆ శాఖ అంటేనే అధికారులు ఇష్టపడటం లేదనే ప్రచారం ఉంది.

మండలం అంటేనే వణుకు..
జిల్లాలోనే సమస్యాత్మక మండలాల్లో వీణవంక మొదటి స్థానంలో ఉంది. 26 గ్రామపంచాయతీలు ఉండగా నర్సింగాపూర్, వీణవంక, మల్లారెడ్డిపల్లి, మామిడాలపల్లి, కోర్కల్‌ తదితర గ్రామాలు సమస్యాత్మక గ్రామాల జాబితాలో ఉన్నాయి. దీంతో వీణవంక మండలం అంటేనే జంకుతున్నారు. ఎంపీడీవో ఇటీవల ఉద్యోగ విరమణ పొందగా, అతడి స్థానంలో ఇన్‌చార్జిగా ఎంపీవోకు చాన్స్‌ వస్తే తనకెందుకు ఆ పదవి అంటూ సెలవులో వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మండలం అంటేనే పోలీస్, తహసీల్దార్, పంచాయతీరాజ్, నీటి పారుదల తదితర శాఖల అధికారులు జంకుతున్నారనే ప్రచారం నెలకొంది. కాగా, శాలువా కప్పుకుంటే పదవి గండం వస్తుందని అధికారుల్లో కలవరం మొదలైంది.  

Advertisement
 
Advertisement
Advertisement