సాక్షి, శంషాబాద్: శంషాబాద్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులు గాయపడ్డారు. దీంతో, రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి హైదరాబాద్‌లోని జలవిహార్‌కు పిల్లలను పిక్నిక్‌కు తీసుకెళ్తున్న రిషి స్కూల్ బస్సు బోల్తా పడింది. ముందున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం కారణంగా పలువురు విద్యార్థులు గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా శంషాబాద్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే, ప్రమాదం జరిగిన సమయంలో వనపర్తి పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్‌ను ఆపి బస్సు దగ్గరికి వెళ్లారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీయించారు. హైదరాబాద్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో మంత్రి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడ్డ విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదానికి గురై భయబ్రాంతులకు లోనైన విద్యార్థులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని షాద్ నగర్ డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పారు. విద్యార్థులకు దగ్గరుండి అన్ని చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.


