
సాక్షి, హైదరాబాద్: రేపటి (అక్టోబర్18,శనివారం) బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా చూసుకోవాలని.. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ అన్నారు. బంద్ పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం చేపట్టబోయే బంద్‌కు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ ప్రజలను కోరింది.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రేపు జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో బషీరాబాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొన్నారు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు తలపెట్టిన రేపటి తెలంగాణ బంద్ కార్యక్రమానికి అదిలాబాద్ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పత్రిఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం: రేపు జరగబోయే బంద్‌కు సంపూర్ణ మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎంకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ ఖమ్మం టౌన్ మహిళా అధ్యక్షురాలు గాజుల శ్రీదేవి ఖమ్మం టౌన్ అధ్యక్షుడు గద్దె వెంకటరామయ్య ఉపాధ్యక్షుడు అమృతం మల్లికార్జున్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.