
ఎన్నికల నిర్వహణ విషయంలో నేడు చిక్కుముడి వీడే చాన్స్
సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో భేటీ కానున్న కేబినెట్
న్యాయస్థానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్లడంపై చర్చించనున్న మంత్రివర్గం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగాల కాంట్రాక్టు రద్దుపై కూడా నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవా ల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాల యంలో సమావేశం కానుంది. సుప్రీంకోర్టు విచారణలో వచ్చే ఫలితం ఆధారంగా ఎన్నికల నిర్వహణ విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాత విధానంలో రిజర్వేషన్లను అమలు పరుస్తూ ఎన్నికలు నిర్వహించుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కనుక స్టే విధించి బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో పంచా యతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తే తక్షణమే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనుంది.
ఒకవేళ స్టే నిరాకరిస్తూ హైకోర్టు సూచనల మేరకు పాత రిజర్వేషన్ల విధానంలోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీం చెప్పినా, ఇతర సూచనలు ఏమైనా చేసినా..తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది.
‘దేవాదుల’,‘తుమ్మిడిహెట్టి’పైనా నిర్ణయాలు!
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగాల నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌తో 2ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. టన్నెల్ బోరింగ్ మెషీన్‌కి బదులు అధునాతన టెక్నాలజీతో సొరంగం తవ్వకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశకు రాంరెడ్డి దామోదరరెడ్డి పేరు పెట్టే అంశాన్ని కూడా రాటిఫై చేయనుంది.
డిసెంబర్ 1 నుంచి విజయోత్సవాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. సనత్‌నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది.
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. హామ్ విధానంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి చేపట్టడంతో పాటు ఎల్‌అండ్‌టీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలును టేకోవర్ చేయాలనే నిర్ణయాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.