
ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్‌ప్లాన్ సిద్ధం
సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్‌వే.. నైట్ ల్యాండింగ్ సదుపాయం
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన అంగీకారం
ప్రస్తుతమున్న 369 ఎకరాలకు మరో 300 ఎకరాల సేకరణకు నిర్ణయం
అన్ని సర్వేలు పూర్తి.. త్వరలో టెండర్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్‌వే.. దానికి ఓవైపు విమానాశ్రయం.. మరోవైపు భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) స్టేషన్. అంటే పౌర విమానాలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలకు కామన్ రన్‌వే అన్నమాట. ఇదీ సమీప భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న ఆదిలాబాద్ విమానాశ్రయ ముఖచిత్రం. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. తొలుత చిన్న విమానాశ్రయాన్నే నిర్మించాలని భావించినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్‌లోనూ భారీ విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఏఏఐ నిర్ణయించింది.
ఎయిర్‌బస్ ఏ–320, బోయింగ్–737 రకం విమానాల రాకపోకలకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఆమోదం తెలిపింది. అలాగే రాత్రివేళల్లోనూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు జరిగేలా వసతుల కల్పనకు కూడా సమ్మతించింది. దీంతో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రాజెక్టులో వరంగల్ విమానాశ్రయ ప్రతిపాదన తర్వాత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రెండో విమానాశ్రయం ఇదే కానుంది. వరంగల్ విమానాశ్రయంతోపాటే దీన్ని కూడా నిర్మించనున్నారు.
ఇప్పటికే అన్ని రకాల సర్వేలు ముగిసి టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా తుది సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఏఐ కోరింది. దానికి ఇక్కడి నుంచి సమాధానాలు ఢిల్లీకి చేరాయి. వాటి ఆధారంగా మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది.
దాదాపు 650 ఎకరాల్లో నిర్మాణం..
ఆదిలాబాద్ పట్టణ శివారులోని శాంతినగర్‌లో నిజాంకాలం నాటి ఎయిర్‌స్ట్రిప్ ఉంది. అక్కడకు కేవలం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌లు మాత్రమే అడపాదడపా వస్తుంటాయి. వీఐపీలు వచ్చినప్పుడు అక్కడి హెలిపాడ్‌ను వాడుతుంటారు. ఈ హెలిపోర్టును ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌గా మార్చుకోవాలని చాలాకాలంగా ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. తొలి నుంచీ హెలిపోర్టుకు చెందిన 369 ఎకరాల స్థలం దాని అధీనంలోనే ఉంది.
అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం కోసం ప్రతిపాదించగా అందుకు ఐఏఎఫ్ సమ్మతించి ఉమ్మడి అవసరాలకు వాడుకునేలా దాన్ని నిర్మించేందుకు అంగీకరిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేయడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 250–300 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు.
తాజాగా అన్ని అడ్డంకులు తీరిపోవడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలు తీర్చేలా ఇక్కడ నైట్ ల్యాండింగ్‌తో కూడిన పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న ఏఏఐ తాజాగా ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌బస్–380, బోయింగ్–777 విమానాలు (అతిపెద్ద విమానాలు) దిగే సామర్థ్యంతో కూడిన రన్‌వే అవసరమా లేక ఎయిర్‌బస్–ఏ320, బోయింగ్–737 రకం విమానాలు దిగే సామర్థ్యంతో కూడిన రన్‌వే కావాలా అని ప్రశ్నించింది.
ఎయిర్‌బస్–ఏ320, బోయింగ్–737 స్థాయి విమానాలు దిగే రన్‌వే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 2.8 కి.మీ. నుంచి 3 కి.మీ. పొడవైన రన్‌వే నిర్మాణానికి నిర్ణయించారు. దానికి ఓవైపు ప్రయాణికుల విమానాలు నిలిచే స్థలం, ప్రయాణికుల ప్రాంగణం మరోవైపు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నిర్మించనున్నారు. సాధారణ ప్రయాణికులు, పౌర విమానాలు రెండో వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయనున్నారు. వాయుసేనకు దాదాపు 50–80 ఎకరాల స్థలం కేటాయించి మిగతా మొత్తాన్ని ప్రయాణికుల విమానాశ్రయానికి వినియోగించనున్నారు.