అధికారులు, ఉద్యోగులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు
ఎన్నికలపై 2–3 రోజుల్లో స్పష్టత
ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే మళ్లీ రిజర్వేషన్లు ఖరారు
జిల్లా ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులు, ఉద్యోగులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు అనే దానిపై రెండుమూడు రోజుల్లోనే స్పష్టత వస్తుందని సంకేతాలిచ్చినట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుతోపాటు ఎన్నికల తేదీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఎన్నికలపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది.
లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు..: ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమస్యలు, చట్టపరమైన అంశాలపై ప్రభుత్వం కోరిన వివరణకు కూడా పీఆర్‌శాఖ సమాధానం పంపించినట్టు తెలుస్తోంది. ఇదివరకు జరిగిన కసరత్తులో నాలుగైదు జిల్లాల వరకు మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ స్థానాల రిజర్వేషన్ల ఖరారులో తప్పులు దొర్లినందున ఈసారి అలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం.
గురువారం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో పాటు 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రెండువారాల్లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలను తెలియజేయాలంటూ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)లను తాజాగా శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో ఇంకా స్పష్టత రాలేదనే ఉద్దేశంతో అధికారులు అలసత్వం చూపొద్దని పీఆర్‌ఆర్‌డీ శాఖ సూచించింది.
శుక్రవారం జెడ్పీ సీఈవోలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్ స్పష్టతనిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర పభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే మళ్లీ రిజర్వేషన్ల (50 శాతం మించకుండా) ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలిసింది. హైకోర్టు ఆదేశాలతో ఎస్‌ఈసీ కూడా ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమైనట్టు సమాచారం.
ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల శాతం ఖరారుతోపాటు, ఫలానా తేదీ లోగా ఎన్నికలు జరపాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు అందగానే ఎన్నికల నిర్వహణ పనులు వేగవంతం చేయనుంది. గతంలోనే ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ జారీచేసినందున, రిజర్వేషన్లు ఖరారై, తేదీలపై స్పష్టత వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి సంసిద్ధంగా ఉన్నట్టు ఎస్‌ఈసీ వర్గాల సమాచారం.


