
విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి.చిత్రంలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి తదితరులు
ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి దాతలు, కార్పొరేట్ల తోడ్పాటు తీసుకోవాలి
విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మౌలిక వసతుల కల్పనలో ఇదే సరైన మార్గమని వెల్లడి
విదేశాల్లోని మెరుగైన విధానాలను అనుసరించాలని సూచన
‘ఔటర్’ పరిధిలో సౌకర్యాలు లేని స్కూళ్లన్నీ ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలని ఆదేశం
నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు పైలట్ ప్రాజెక్టుగా కొత్త స్కూళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు వీలుగా సరికొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు.
ఇందులో భాగంగా స్కూళ్ల అభివృద్ధికి నిధులిచ్చే దాతలు, పూర్వ విద్యార్థుల తోడ్పాటు తీసుకోవాలని కోరారు. మౌలిక వసతుల కల్పనలో ఇది సరైన మార్గమని పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ఆయా స్కూళ్లలో ఆట స్థలాలు, అవసరమైనన్ని తరగతి గదులతోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. స్థలం సమస్య వల్ల సౌకర్యాలలేమి ఎదుర్కొంటున్న పాఠశాలలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి తరలించాలని ఆదేశించారు. విదేశాల్లో విద్యా వ్యవస్థల పరిశీలనకు టీచర్లను పంపే ప్రక్రియను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇతర దేశాల్లోని మెరుగైన విధానాలను అనుసరించాలని సూచించారు.
నిధుల కొరత వల్ల..
విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలు, జరుగుతున్న కృషిని అధికారులు సీఎంకు వివరించారు. అయితే నిధుల కొరత అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు నిధులు మంజూ రు కాలేదని.. ముఖ్యంగా చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 100 కోట్ల చొప్పున, మిగతా వర్సిటీలకు రూ. 35 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయింపులు చేసినా ఇప్పటికీ నిధులివ్వలేదని పేర్కొన్నారు.
దీనివల్ల వర్సిటీల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకుండా పోతోందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రస్తుతానికి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటున్నందున కార్పొరేట్ సంస్థల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నట్లు అధికార వర్గాల సమాచారం.
నర్సరీ స్కూళ్లపై దృష్టి
నర్సరీ స్కూళ్ల ఏర్పాటుపై సీఎం సమీక్షిస్తూ వాటి ఏర్పాటు, ప్రజల్లో అవగాహన గురించి అధికారులను వివరాలు అడిగారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు కొత్త స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు సరికొత్త రీతిలో బోధన జరిగేలా చూడాలన్నారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్ళకుండా పేద విద్యార్థులను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం ఇది అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉన్నత విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.