
విమాన పైలట్లను కంగారు పెడుతున్న లేజర్ లైట్లు
విమానాశ్రయాల సమీపంలో ప్రమాదాలకు హేతువు
టేకాఫ్, ల్యాండింగ్‌లకు ఈ లైట్లతో ఇబ్బందులు
ఎయిర్‌పోర్టుల పరిసరాల్లో నిషేధాజ్ఞలున్నా ఆగని వాడకం
ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద లేజర్ కలకలం
శంషాబాద్: విందులు వినోదాలు చేసుకునేవారికి అవి మిరుమిట్లు గొలిపే కాంతులు.. కానీ, వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విమాన పైలట్లకు మాత్రం అవి కంగారు పుట్టించే వెలుగులు. విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లపై తీవ్ర ప్రభావం చూపే లేజర్ లైట్లను విమానాశ్రయాల సమీపంలో వినియోగించరాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించినప్పటికీ.. కొందరు తరచూ వాటిని వాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో కూడా వీటి వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ప్రారంభంలో చిన్నచిన్న గ్రామాలే ఉండేవి. గత దశాబ్దకాలంగా చుట్టూ జనావాసాలు, వాణిజ్య కార్యకలాపాలు భారీగా పెరిగాయి. అనేక కన్వెన్షన్లతోపాటు కొందరు సంపన్నులు ఎయిర్‌పోర్టుకు అత్యంత సమీపంలోనే విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు.
ఎయిర్‌పోర్టు సమీపంలో లేజర్ లైట్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ కొదరు పట్టించుకోవటంలేదు. ఆరేళ్ల క్రితం కొందరు బాలురు బర్త్‌డే పార్టీ చేసుకుని లేజర్ లైట్లు వేయటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగేందుకు గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమాన పైలట్ కంగారు పడ్డాడు. అప్పట్లో ఇది పెద్ద కలకలమే రేపింది. తాజాగా మూడు రోజుల క్రితం కూడా ఓ విమానంపై గ్రీన్ కలర్ లేజర్ కాంతులు పడ్డాయనే సమాచారంపై అంతర్గత విచారణ చేపట్టారు.
కఠిన నిబంధనలున్నాయి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో లేజర్ లైట్లు, డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదు. ఎవరైనా ఈవెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ముందుగానే నిబంధనలు వివరించి లేజర్ లైట్లు వాడకూడదని స్పష్టంగా చెబుతాం. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిబంధనలు అతిక్రమించి ఎవరైనా వినియోగిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. – బి. రాజేష్, శంషాబాద్ డీసీపీ
ఏమిటి నిబంధనలు?
విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ కాంతుల వాడకంపై డీజీసీఏ పలు నిబంధనలు పెట్టింది. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల లోపు వివిధ జోన్లుగా విభజించి నిబంధనలు పెట్టారు. కాంతి ప్రసార వేగం ఆధారంగా నిబంధనలు రూపొందించారు. మొదటిది లేజర్ బీమ్ ఫ్రీ ఫ్లైట్ జోన్. ఈ జోన్ పరిధిలో లేజర్ కాంతులు పూర్తిగా నిషిద్ధం. రెండోది లేజర్ బీమ్ క్రిటికల్ ఫ్లైట్ జోన్. ఇందులో లేజర్ కాంతి ప్రసారం మేరకు నిబంధనలుంటాయి. మూడోది లేజర్ బీమ్ సెన్సిటివ్ ఫ్లైట్ జోన్.
పైలట్ల కష్టాలు..
టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో లేజర్ కాంతులతో పైలట్లు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. వేగవంతమైన కాంతి ద్వారా పైలట్లకు ఫ్లాష్ బ్‌లైండ్‌నెస్ ప్రమాదం ఉంటుంది. దీంతో తాత్కాలిక దృశ్యలోపంతో పైలట్లు కంగారు పడతారు. దీంతోపాటు ఆఫ్టర్ ఇమేజ్ ప్రభావం ఉంటుంది. లేజర్ కాంతి పడి తర్వాత పోయినా ఆ దృశ్యం కళ్లలో నిక్షిప్తమై మరోమారు కనిపిస్తుంటుంది. ఇది దృష్టిభ్రమ లాంటింది. ఇది కూడా పైలట్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
తీవ్ర ప్రభావం ఉంటుంది
రన్‌వేపై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటుచేసే లైటింగ్, సహజ వెలుగుల ప్రభావంతో టేకాఫ్, ల్యాండింగ్‌లు ఆధారపడి ఉంటాయి. అకస్మాత్తుగా లేజర్ కాంతులు పడితే పైలట్లు తీవ్ర ప్రభావానికి లోనవుతారు. దృశ్యలోపం కూడా సంభవిస్తుంది. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో లేజర్ కాంతులపై కఠిన నిబంధనలు కొనసాగించాలి. – నవీన్‌చందర్, విశ్రాంత పైలట్