
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దాని విలువ రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది.
డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ జోన్ అధికారులు సమాచారం ఆధారంగా.. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళా ప్రయాణికురాలిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్‌కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది.
డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేసిన ఆ మొత్తం 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి విలువ రూ.12 కోట్ల దాకా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో ఆ ప్రయాణికురాలిని ఎన్‌డీపీఎస్ చట్టం-1985 కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
హైడ్రోపోనిక్ గంజాయి అంటే..
హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్‌తో సమానమైన మత్తు కలిగిస్తుంది.
హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్‌లాండ్ నుంచి అక్రమంగా భారత్‌కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల రూ.53 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది.
శిక్ష ఏంటంటే..
హైడ్రోపోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయానికి భారతదేశంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ నేరం ఎన్డీపీఎస్ చట్టం 1985 (Narcotic Drugs and Psychotropic Substances Act) ప్రకారం శిక్షించబడతారు. ఈ చట్టం కింద బెయిల్ పొందడం చాలా కష్టం. నేరం తీవ్రతను బట్టి కోర్టు విచారణ జరుగుతుంది.
గంజాయి రవాణా, విక్రయానికి.. 10–20 సంవత్సరాల జైలు + రూ. 1–2 లక్షల జరిమానా విధిస్తారు. మళ్లీ అదే నేరం చేస్తే గనుక.. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే జీవిత ఖైదూ విధించవచ్చు.