సిరిసిల్ల: గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్‌లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు.
హార్ట్‌స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు.
పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్‌రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.


