సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో నేడు(ఆదివారం, డిసెంబర్ 21) ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ భేటీలో పాల్గొనడానికి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి శనివారమే కేసీఆర్ చేరుకున్నారు.
ఇవాళ జరగబోయే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్.. దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు చెబుతోంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని బీఆర్‌ఎస్ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ డౌన్ అయ్యిందని బీఆర్‌ఎస్ బలంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ భేటీని పార్టీ కీలకంగా భావిస్తోందని సమాచారం.


