నల్గొండ జిల్లా: రెండేళ్లుగా గుంతలమయంగా మారిన రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎర్రబెల్లి గ్రామ నూతన సర్పంచ్ అయితగోని మధు, ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజల సమస్యకు పరిష్కారం చూపారు.
ముషంపల్లి నుంచి ఎర్రబెల్లి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు అడ్డంకిగా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎర్రబెల్లి సర్పంచ్‌గా అయితగోని మధు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అనంతరం గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, తన సొంత ఖర్చులతో ఆ రోడ్డుపై మొరం మట్టి వేయించి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ, అధికారికంగా బాధ్యతలు స్వీకరించేలోపే అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషకరమని గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని అయితగోని మధు తెలిపారు.


