
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ కాంతులు వేయడం నిషేధం అయినప్పటికీ ఓ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మంగళవారం రాత్రి తిరుపతి నుంచి బయలుదేరి విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాత్రి 9.30 సమయానికి చేరుకుంది.
రన్‌వే 09ఆర్ వద్ద ల్యాండ్ అవుతున్న సమయంలో ఎయిర్‌పోర్టుకు ఎడమవైపు బయటి ప్రాంతం నుంచి ఆకుపచ్చని రంగులోని లేజర్ కాంతులు విమానంపై పడినట్లు సమాచారం అందింది. దీనిపై అప్రమత్తమైన అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే దీనిపై ఎయిర్‌లైన్స్ వర్గాలు కానీ, ఎయిర్‌పోర్టు అధికారులు కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్, ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు సీఐ కనకయ్య ‘సాక్షి’కి తెలిపారు.
సుమారు ఆరేళ్ల కిందట రషీద్‌గూడలో కొందరు యువకులు బర్త్‌డే పార్టీ చేసుకున్న సమయంలో డీజేతో పాటు లేజర్ లైట్లు ఉపయోగించడంతో విమానాన్ని ల్యాండ్ చేస్తున్న సందర్భంలో పైలట్ కంగారు పడి ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన అప్పట్లో కలకలం రేపింది. తాజాగా వచ్చిన సమాచారం ఎయిర్‌పోర్టు ప్రిడెక్టివ్ ఆపరేషన్ కేంద్రానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఇది ఏఐ జనరేటెడ్ కావడంతో దీనిని ధ్రువీకరించుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.