
హైదరాబాద్: వెదర్ ఎఫెక్ట్ పలు విమాన విమాన ప్రయాణాలపై పడుతోంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో(Shamsha Bad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
శుక్రవారం ఉదయం నుంచి పలు విమానాలను ల్యాండింగ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అనుమతి లభించడం లేదు. ఎయిర్ పోర్ట్ మొత్తం అల్లకల్లోల వాతావరణం ఉండడంతో విమానాలను దింపట్లేదు. పుణే-హైదరాబాద్ విమానాలు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు(Vijayawada Gannavaram Airport) వైపునకు దారి మళ్లుతున్నాయి. అలాగే..
ముంబై, కోల్‌కతా విమానాలను కూడా అటువైపే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో(Hyderabad Airport) వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఈ మళ్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.
శంషాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్
కెమికల్ ట్యాంకర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో.. శంషాబాద్ వద్ద శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు ఐదు కిలోమీటర్లపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వర్షంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మూడు గంటలుగా ట్రాఫిక్ పోలీసులు ఎవరూ అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఆ సినిమాతో ప్రజలకు ఒరిగేది ఏమైనా ఉందా?: హైకోర్టు