
టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
రూ.800 వెచ్చించి ఎందుకు టికెట్ కొనాలి?
ప్రజలను అడిగి సినిమా తీశారా?
పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఫైర్
సింగిల్ జడ్జే నిర్ణయిస్తారన్న డివిజన్ బెంచ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రంతో ప్రజలకు ఒరిగేది ఏముందని, టికెట్ ధర పెంచితే ఎందుకు కొనాలని ప్రభుత్వాన్ని, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. రూ.వందల కోట్లతో చిత్ర నిర్మాణం చేపట్టే ముందు.. కొందరికి మాత్రమే రూ.కోట్లు ఇచ్చే ముందు ప్రజల అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది.
మీ ఇష్టం వచ్చినట్లు సినిమా తీసి వందల కోట్లు ఖర్చు చేశాం.. ప్రజలు కూడా వందలకు వందలు వెచ్చించి కొనాల్సిందేనని భావించడం సమర్థనీయం కాదంది. శుక్రవారం (26న) మరోసారి వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని కోరుతున్నామని డివిజన్ బెంచ్ పేర్కొంది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ అప్పీల్‌పై విచారణ ముగించింది.
సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్
వచ్చే నెల 4 వరకు ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుతూ, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది బర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి మెమోను నిలిపివేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ హైకోర్టులో డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
అప్పీలెంట్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్‌దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారని, మెమో గడువు 4వ తేదీతో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత విచారణతో అప్పీలెంట్‌కు ప్రయోజనం ఉండదన్నారు. పిటిషనర్‌కు కలిగింది రూ.100 నష్టం మాత్రమేనని, అది డిపాజిట్ చేస్తామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని రూ.100 కాదు.. రూ.100 కోట్లు డిపాజిట్ చేయండి అని అడిగింది. పిటిషనర్ దాఖలు చేసింది పిల్ కాదని, రిట్ పిటిషన్‌లో ప్రజా ప్రయోజనాలు కోరలేదని అవినాశ్ దేశాయ్ చెప్పారు.
రిట్ పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపిస్తూ.. మెమో జారీ చేసే అధికారం హోంశాఖ ముఖ్య కార్య దర్శికి లేదన్నారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు మాత్రమే ఆ అధికారం ఉందన్నారు. గతంలో సినిమా టికెట్లపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకోవడం చట్టవిరుద్ధమన్నారు. గేమ్ ఛేంజర్, పుష్ప చిత్రాలకు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇదే హైకోర్టు నిలిపివేసిందని గుర్తు చేశారు.
కోర్టులు సమర్థించాలా?
వాదనలు విన్న డివిజన్ బెంచ్.. కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచటం సరికాదంది. రూ.1,000 కోట్లు పెట్టి సినిమా తీయడం వల్ల ప్రజలకు ఒరిగేదేముందని ప్రశ్నించింది. అది కొందరు వ్యక్తుల లబ్ధికోసమేనని పేర్కొంది. రూ.150 టికెట్‌ను రూ.800కు ప్రజలు ఎందుకు కొనాలని.. దీనికి ప్రభుత్వం ఎందుకు సహకరించాలో ఒక్క కారణం చెప్పాలని అడిగింది.
ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు సమర్థించాలా అని ప్రశ్నించింది. ప్రజలకు చెప్పి హైబడ్జెట్ సినిమాలు తీస్తున్నారా.. వాళ్లు తీయమని అడిగారా అని నిలదీసింది. టికెట్ల పెంపు విధానపరమైన నిర్ణయమైతే జీవో జారీ చేయకుండా.. మెమో ఎలా విడుదల చేస్తారని తప్పుబట్టింది. శుక్రవారం సింగిల్ జడ్జి విచారణ చేపట్టి.. ఈ ఉత్తర్వులతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటారని చెప్పింది.