సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ కావడంతో డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. గేమింగ్ సైట్‌లోకి వెళ్తుందని రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
పలు సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. సైట్‌ను రిస్టోర్ చేసిన ఎన్‌ఐసీ అధికారులు.. విదేశీ గేమింగ్ యాప్‌ల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. వెబ్‌సైట్ సబ్ సబ్ డొమైన్స్ యథావిధిగా పనిచేస్తున్నట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి. కోర్టు కేసు లిస్టులు.. ఇతర బ్లాగులు సవ్యంగానే కొనసాగుతున్నట్లు వివరించాయి.
కాగా, దేశంలో జనం జేబులను గుల్లచేస్తూ, వారి ప్రాణాలను బలి తీసుకున్న ఆన్‌లైన్ గేమ్‌లకు చెక్‌పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. డబ్బుతో ముడిపడి ఉన్న ఆన్‌లైన్ గేమ్‌లను నిర్వహించినా లేక ప్రోత్సహించినా లేక ప్రచారం చేసినా జైలుశిక్ష లేదా భారీ జరిమానా.. కొన్నిసార్లు జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించేలా ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు–2025’ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
అన్ని రకాల ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్‌లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది.


