రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
కేసీఆర్ పిటిషన్‌లో కౌంటర్ సమర్పించిన సర్కార్
బరాజ్ కూలడానికి, ఆర్థిక నష్టానికి ఆయనే బాధ్యుడని వెల్లడి
పిటిషన్‌ను కొట్టివేయాలని కోరిన రాహుల్ బొజ్జా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి మూడు వారాల్లో పిటిషనర్లు రిప్లై కౌంటర్లు వేయాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ జనవరి 19కి వాయిదా వేసింది. అప్పటిదాకా జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలు వద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసీఆర్ పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేశామని, మిగతా మూడు పిటిషన్లలో కౌంటర్లు వేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. సమ్మతించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది.
కేబినెట్ ఆమోదం లేకుండానే...
ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కౌంటర్ వేశారు. అందులోని అంశాల మేరకు... ‘కాళేశ్వరంలో అక్రమాల నిగ్గుతేల్చేందుకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారమే చంద్రఘోష్ కమిషన్ నియమాకం జరిగింది. పిటిషన్‌ను పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోక ముందే పిటిషనర్ (కేసీఆర్) కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ ఎస్‌ఆర్ టెండూల్కర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన మేరకు కమిషన్ నివేదిక ఓ నిజనిర్ధారణ నివేదిక మాత్రమేనని దానికి ఎలాంటి చట్టబద్ధత లేదన్నది పిటిషనర్ వాదన.
కానీ, ఆయనకు కమిషన్ చర్యలు, చట్టపరమైన అంశాలు తెలుసు. పిటిషనర్ అభ్యర్థన మేరకు కమిషన్ ఇన్‌కెమెరా విచారణ సాగించింది. పిటిషనర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో తీవ్రమైన అక్రమాలకు పాల్పడ్డారని కమిషన్ ఎత్తిచూపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ వేయగా, దాన్ని కూడా పిటిషనర్ ఈ కోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీనిపై కేసీఆర్ సుప్రీంకు వెళ్లారు.
కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంపై పిటిషనర్‌కు అవగాహన ఉన్న కారణంగానే ఆయన పిటిషన్లు వేశారు. సెక్షన్ 8బీ, 8సీ తనకు తెలియదని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎలాంటి నిరసన, అభ్యంతరం లేకుండా స్వచ్ఛందంగా కమిషన్ ముందు విచారణకు హాజరైనందున సెక్షన్ 8బీ, 8సీ కింద నోటీసులు కోరే హక్కు లేదు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ విచారణ సాగిందనడం అర్థరహితం. కమిషన్ ఏర్పాటు, నివేదిక సెక్షన్ 4(ఎఫ్) ప్రకారం చట్ట సమ్మతం. కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదు.. అత్యంత ప్రజా ప్రాముఖ్యత అంశం.
బరాజ్ కూలిపోయి ఖజానాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాజెక్టు ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, కాంట్రాక్టు మంజూరు, అమలు, నిర్వహణ, నాణ్యతా నియంత్రణలోనే కాకుండా ఆర్థిక దుర్వినియోగం వంటి తీవ్రమైన అవకతవకలను కమిషన్ నిర్ధారించింది. పిటిషనర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి స్థల ఎంపిక, డిజైన్ ఖరారు, ప్రారంభ కాంట్రాక్టు మంజూరు, బరాజ్‌ల నిర్మాణం, నిర్వహణ పనులను కమిషన్ పరిశీలించింది. ఇది రాజకీయ వ్యూహం అన్న పిటిషనర్ వాదన నిరాధారం. మేడిగడ్డ వద్ద నిర్మాణంపై నిపుణుల కమిటీ ముందే హెచ్చరించింది.
అయినా నిర్లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మాణాలకు పరిపాలన అనుమతులు బిజినెస్ రూల్స్ ప్రకారం కేబినెట్ ముందు ఉంచాలి. కానీ, అలా చేయలేదు. కేంద్ర జల సంఘం పరిశీలనకు ముందే పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. మెస్సర్స్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ డీపీఆర్‌ను విస్మరించారు. పిటిషనర్ రాష్ట్రానికి భారీ ఆర్థిక నష్టాన్ని సమర్థించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన ఇంజనీరింగ్ లోపాలు, ఒప్పందాల ప్రకారం నిర్వహణ లేకపోవడం పేర్కొనడం వాస్తవం.
అక్రమాలను నిర్మూలించడానికి, లక్ష్యాలను అమలు చేయడానికి శాసన, పరిపాలనా చర్యలు తీసుకోవడానికి విచారణ కమిషన్ సిఫార్సులు ప్రస్తుత ప్రభుత్వానికి అవసరం. బరాజ్ నిర్మాణ స్థలాన్ని మార్చవద్దని వివిధ కమిషన్లు సిఫార్సులు చేసినా వినకుండా పిటిషనర్ రూ.7500 కోట్లు ఖజానాపై భారం పడేలా చేశారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదు. కొట్టివేయండి. మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేయండి’అని కౌంటర్‌లో పేర్కొన్నారు.


