సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు భారీగా సెలవులు పెట్టారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 వేలకు పైగా టీచర్లు క్యాజువల్ లీవ్ (సీఎల్) తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం శనివారం 40,005 మంది సీఎల్ పెట్టారు. రాష్ట్రంలో 1.12 లక్షల టీచర్లున్నారు.
వీరిలో 40 వేల మంది సెలవుపెట్టారంటే 33 శాతం మంది సెలవులో ఉన్నట్లు లెక్క. దీంతో చాలా మటుకు బడుల్లో పాఠాలు అటకెక్కాయి. జగిత్యాల జిల్లాలోని ఓ స్కూళ్లో ఆరుగురు టీచర్లకుగాను నలుగురు టీచర్లు సెలవు పెట్టగా, ఇద్దరు టీచర్లు మాత్రమే విధులకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఓ స్కూళ్లో 17 మందికి ఏడుగురు టీచర్లు విధులకు హాజరుకాలేదు. ఇదే పరిస్థితి చాలా బడుల్లో నెలకొన్నది. క్రిస్మస్, బాక్సింగ్‌డే సందర్భంగా గురు, శుక్రవారాల్లో సెలవులొచ్చాయి.
శనివారం మాత్రమే పనిదినం కాగా, ఆదివారం సెలవు కావడంతో చాలా మంది టీచర్లు సెలవుపెట్టారు. ఇక సంవత్సరం ముగింపునకు చేరుకోవడం, సీఎల్‌లు ఉండటంతో వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో మరికొందరు టీచర్లు సెలవుల్లో వెళ్లారు. ఇక మరికొందరు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ ఉండటంతో విధులకు గైర్హాజరైనట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.


