స్త్రీలోక సంచారం
♦ అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ, ఇప్పుడున్న సీఎల్స్ (క్యాజువల్ లీవ్స్)కు అదనంగా మరో ఐదు సెలవులను ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవులను పెంచాలని ‘తెలంగాణ సచివాలయం సంఘ’ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి.. రాష్ట్ర ఆర్థికశాఖ కల్పించిన ఈ సదుపాయం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లోని మహిళా టీచర్లకు, మహిళా జూనియర్ లెక్చరర్లకు కూడా వర్తిస్తుంది.
♦ టీవీ మెడికల్ డ్రామా ఇ.ఆర్. (ఎనర్జీ రూమ్) లో ‘వెండీ గోల్డ్‌మన్’ అనే నర్సు పాత్రలో ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ నటి వెనిస్సా మార్క్విజ్ (49) చేతిలోని బిబి గన్ (బాల్ బులెట్ గన్) గురి అకస్మాత్తుగా తమ వైపునకు తిరగడంతో దానిని నిజమైన తుపాకీగా భావించిన కాలిఫోర్నియా పోలీసులు, తొందరపడి ఎదురు కాల్పులు జరపడంతో వెనిస్సా అక్కడికక్కడే మరణించారు. లైంగికంగా వేధించిన విషయం బయటపెట్టడంతో హాలీవుడ్ నుంచి తనను తరిమికొట్టడానికి అమెరికన్ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన జార్జి క్లూనీ (57) తనను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారని గత ఏడాది ఆరోపించిన వెనిస్సా.. బుధవారం నాడు లాస్‌ఏంజెలిస్‌లోని తన ఫ్లాట్‌లో బిబి గన్ను చేత్తో పట్టుకుని ఎవరితోనో గొడవ పడుతున్నప్పుడు చూసిన ఫ్లాట్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన పర్యవసానంగా ఈ దురదృష్టకరమైన సంఘటన జరగ్గా.. వెనిస్సా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఆమె మనోస్థితి కూడా సరిగ్గాలేదని ఆమె ఫ్రెండ్ ఒకరు పోలీసులకు తెలిపారు.
♦ ఇటీవల మరణించిన అమెరికన్ సీనియర్ గాయని అరెథ్రా ఫ్లాంక్లిన్ అంతిమ నివాళి సందర్భంగా, శుక్రవారం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బిషప్ చార్ల్స్ హెచ్ ఎల్లిస్.. అక్కడికి వచ్చిన యువ గాయని అరియానా గ్రాండేను (25) తాకి మాట్లాడడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవడంతో చివరికి ఆమెకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఎడమ చేత్తో మైకు పట్టుకుని ఉన్న బిషప్ చార్ల్స్.. తన కుడి చేతిని అరియానా నడుము చుట్టూ వేసి మాట్లాడుతున్నప్పుడు అతడి చేతి వేళ్లు ఆమె వక్షానికి నొక్కుకోవడంపై విమర్శలు రావడంతో.. ‘‘ఏ స్త్రీ వక్షాన్నయినా తాకాలన్నది ఎప్పటికీ నా ఉద్దేశం కాబోదు. బహుశా నేను హద్దులు దాటినట్లున్నాను. బహుశా నేను మితిమీరిన స్నేహభావనతో, బహుశా నేను అతి ఆప్యాయతతో ప్రవర్తించినట్లున్నాను. ఇందుకు నా క్షమాపణలు’’ అని అరియానాకు ఈమెయిల్ పంపించారు కానీ, ఆ ఈమెయిల్‌కు ఆమె ప్రతినిధి నుండి వెంటనే అయితే ఎలాంటి సమాధానమూ రాలేదు.
♦ స్వీడన్‌లోని గూటెన్బర్గ్లో రెండు రోజుల పాటు జరిగిన ‘మ్యాన్–ఫ్రీ’ ‘స్టేట్మెంట్ ఫెస్టివల్’లో నిర్వాహకులు, సందర్శకులు, మ్యూజిక్ బ్యాండ్ కళాకారులు, జర్నలిస్టులు, సెక్యూరిటీ సిబ్బందీ.. అంతా మహిళలే పాల్గొన్నారు. గత ఏడాది స్వీడన్లో భారీ ఎత్తున జరిగిన ‘బ్రావల్లా ఫెస్టివల్’లో నాలుగు రేప్‌లు, 23 లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అంది, ఈ ఏడాది జరగవలసిన ఆ ఫెస్టివల్ రద్దు అవడంతో పాటు, ఇకనుంచీ వీలైనంత వరకు పురుషులకు ఏమాత్రం ప్రవేశం లేకుండా ఉత్సవాలను నిర్వహించుకోవడం.. లైంగిక అకృత్యాలకు ఒక చక్కటి పరిష్కారంగా తాము భావించినట్లు.. ఈ సరికొత్త ఆల్–ఉమెన్ ‘స్టేట్మెంట్ ఫెస్టివల్’ వ్యవస్థాపకురాలైన కమెడియన్ ఎమ్మా నైకర్ చెబుతున్నారు.
♦ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో గత నెలలో ముంబైలో నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి అక్టోబర్‌లోనా లేక, వచ్చే ఏడాదా; పెళ్లి ఇటలీలోనా లేక, యు.ఎస్.లోనా అని ఆ దంపతులు ఒక నిర్ణయానికి రాకముందే.. ఆమె కాబోయే మామగారు, నిక్ జోనాస్ తండ్రి అయిన పాల్ జోనస్‌కు 7 కోట్ల రూపాయలకు పైగా (మిలియన్ డాలర్లు) అప్పులు, అతడి రియల్ ఎస్టేట్ కంపెనీ కోర్టు కేసులో ఓడిపోయిన కారణంగా కట్టవలసిన మరో కోటీ తొంభై లక్షల రూపాయలకు పైగా (2 లక్షల 68 వేల డాలర్లు) చెల్లింపులు ఉన్న విషయం బయటపడింది. అయితే ఇది కొత్తగా బయటపడిన సంగతేమీ కాదనీ, ఇవన్నీ ప్రియాంకకు తెలియకుండా ఉండవని ఆమె శ్రేయోభిలాషులు భావిస్తుండగా, నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. నిక్ దగ్గర ఉన్న 180 కోట్ల రూపాయల నికర ఆస్తుల ముందు అతడి తండ్రివి తీర్చలేనంత అప్పులు కాదు కనుక, ఆ భారం ప్రియాంకపై పడే అవకాశం లేదనీ, అసలు కొడుకు మీద కూడా భారం పడకుండా ప్రియాంక మామగారు తన కంపెనీ ఆస్తులు అమ్మి బకాయీలన్నీ కట్టేస్తారని వినిపిస్తోంది.
♦ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు వరకు ఆయన జీవితంలో ఉన్న స్త్రీలపై అమెరికన్ రచయిత్రి, జర్నలిస్టు అయిన నీనా బర్లీ రాసిన ‘గోల్డెన్ హ్యాండ్‌కఫ్స్ : ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ట్రంప్స్ ఉమెన్’ అనే పుస్తకం అక్టోబర్ 16న విడుదల అవుతోంది. పరిశోధనాత్మక వార్తలకు, స్త్రీవాద విశ్లేషణలకు ప్రసిద్ధురాలైన నీనా బర్లీ.. ట్రంప్ తల్లి, ట్రంప్ ముగ్గురు భార్యలు, ట్రంప్ సిస్టర్స్ (ఒక అక్క, ఒక చెల్లి), ట్రంప్ కూతుళ్లతో పాటు.. ట్రంప్ కంపెనీల్లోని మహిళా ఉద్యోగుల గురించి ఈ పుస్తకంలో రాసినట్లు ప్రచురణ సంస్థ అయిన ‘గ్యాలరీ బుక్స్’ వెల్లడించింది.
♦ కల్పిత ఆరోగ్య సేవలను డాక్యుమెంట్లలో చూపి, ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య బీమా పథకాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారన్న నేరారోపణలు రుజువు కావడంతో యు.ఎస్.లోని భారతీయ సంతతి వైద్యురాలైన విలాసినీ గణేశ్ (47)కు, ఆమె భర్త గ్రగరీ బెల్చర్కు కాలిఫోర్నియా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమలు కానున్న ఈ జైలు శిక్ష పూర్తయిన అనంతరం, విడుదలయ్యాక కూడా విలాసిన మరో మూడేళ్ల పాటు పోలీసు నిఘా ఉండడంతో పాటు, సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయలను (3,44,000 డాలర్లు) తన అక్రమాలకు పరిహారంగా చెల్లించవలసి ఉంటుంది.
♦ 91 ఏళ్ల వయసులో 2010 మే 1న కన్నుమూసిన అమెరికన్ టీవీ నటి హెలెన్ వాగ్నర్ 100వ జయంతి నేడు. 1918 సెప్టెంబర్ 3న టెక్సాస్‌లో జన్మించి.. అమెరికన్ టీవీలో 1956 ఏప్రిల్ 2 న మొదలై, 54 ఏళ్ల పాటు సాగి, 2010 సెప్టెంబర్ 17న ముగిసిన ‘యాజ్ ద వరల్డ్ టర్న్స్’ అనే సీరియల్లోని ‘నాన్సీ హ్యూస్ మెక్క్కోస్కీ’ పాత్రలో తను మరణించేనాటి వరకూ నటిస్తూనే ఉన్న హెలన్ను.. ఒకే పాత్రలో దీర్ఘకాలం నటించిన నటిగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్’ గుర్తించింది.