పరస్పర విరుద్ధ పిటిషన్లు వేస్తున్న సునీత
కేసు సత్వర విచారణకు హైకోర్టులో పిటిషన్లు
మరోవైపు దర్యాప్తును ఇంకా కొనసాగించాలని సీబీఐ కోర్టుకు వినతి
కేసు విచారణ ఆలస్యానికే ఇలాంటి పిటిషన్లు దాఖలు
వైఎస్ వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ప్రతివాదుల వాదనల
తదుపరి విచారణ 17కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: స్వప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను వినియోగించుకోవాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ప్రయత్నిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ప్రతివాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురామ్ శుక్రవారం విచారణ చేపట్టారు.
వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. అంతకుముందు ప్రతివాదుల తరఫున న్యాయవాదులు సాయి వంశీకృష్ణ, ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ, ‘సునీత పరస్పర విరుద్ధ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఒకవైపు కేసు సత్వర విచారణకు హైకోర్టులో పిటిషన్లు వేస్తూ, మరోవైపు మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు నచ్చినట్లు విచారణ చేయాలని కోరడం ఎంతమాత్రం చెల్లదు.
ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే భవిష్యత్‌లో బాధితులమని చెప్పుకొనేవారంతా దర్యాప్తు సంస్థలను సొంత లబ్ధికి ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. సునీత చర్యలన్నీ అర్థం లేకుండా ఉన్నాయి. సత్వర విచారణ కోరుతున్నారా? లేదా విచారణ ఇంకా జాప్యం కావాలని కోరుకుంటున్నారా? అనే అంశంపై స్పష్టత లేకుండా ఆమె న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
ఇలా ఇష్టమొచ్చినట్లు వేస్తున్న పిటిషన్లతో కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాదు.. విచారణ ఏళ్లకు ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ కేసులో రోజూ విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే, ఈ కోర్టు మళ్లీ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా నిష్ప్రయోజనం అవుతుంది. న్యాయస్థానంలో కేసు విచారణ ఆలస్యం చేయడానికే సునీత ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు. పిటిషన్ సమర్థనీయం కాదు. కొట్టివేయండి’ అని నివేదించారు.
చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తు ఏమిటి?
‘సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ దిగువ కోర్టును నిర్ణయం తీసుకోమని చెప్పింది. అయితే, వాస్తవ పరిధి ఉన్న కడప కోర్టును ఆదేశించిందా? లేక హైదరాబాద్‌లోని ఈ కోర్టును ఆదేశించిందా? అనేది సందేహాస్పదంగా మారింది. ‘అధికార పరిధి’ తేలిస్తే ఈ పిటిషన్ మెయింటెనబుల్ అవుతుందో? లేదో? తెలుస్తుంది. సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్లలో ప్రతివాదులుగా సీబీఐని తప్ప నిందితులను చేర్చలేదు. దీంతో వారి వాదనలు వినిపించే అవకాశం లేకుండా పోయింది.
సుప్రీం కోర్టు మరింత దర్యాప్తునకు ఆదేశించలేదు. దిగువ కోర్టును ఆశ్రయించాలని మాత్రమే ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో వేసిన పలు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం వద్ద ప్రస్తావించలేదు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదంటూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత మళ్లీ దర్యాప్తు చేయాలని కోరడం చట్టవిరుద్ధం. ఏ కేసులోనైనా చార్జెస్ ఫ్రేమ్ చేశాక దర్యాప్తు కొనసాగించడం సాధ్యం కాదు.
ఫలాన ఫలాన అంశాలపై దర్యాప్తు చేయాలని సునీత కోరలేరు. ఎలా దర్యాప్తు చేయాలో కూడా ఆమె చెబుతుండడం సరికాదు. సీబీఐ తనకు నచ్చినట్లు, తను చెప్పినట్లు దర్యాప్తు చేయాలని ఆమె పట్టుబట్టడం చెల్లదు. దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టులో వెల్లడించిన సీబీఐ, మళ్లీ విచారణ ఎలా ప్రారంభిస్తుంది’’ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.


