రహదారుల్నీ వదలట్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ఖాళీ జాగాలే కాదు... రోడ్డును కూడా వదలకుండా ఎక్కడికక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇక ఆ రోడ్డుకు డెడ్ ఎండ్ ఉంటే పరిస్థితి మరింత దారుణం. ఎదుటి వారికీ దాన్ని వినియోగించుకునే హక్కు ఉందని మర్చిపోతున్నారు. ఇలాంటి అనేక సమస్యలపై నగర వాసులు హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా మొత్తం 44 ఫిర్యాదులు అందాయి. వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లోని శ్రీ వీరాంజనేయ కాలనీలో 18 అడుగుల రహదారిని అక్కడ ప్లాట్లు ఉన్న వారు కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పష్టంగా రోడ్డు వేసి, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసినా... కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారని, స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్ విలేజ్‌లోని శ్రీ రాంనగర్ కాలనీలో సర్వే నం.202లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడమే కాకుండా.. తమ ఇళ్లకు దారి లేకుండా మూసేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. మచ్చబొల్లారంలోని సూర్యనగర్ బస్టాప్ వద్ద 30 అడుగుల రోడ్డును ఏడు అడుగుల మేర కబ్జా చేసేశారని, దీంతో అక్కడ బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని బాలాజీ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మహేశ్వరం మండలం, శ్రీనగర్ విలేజ్‌లోని సర్వే నం. 249, 248ల్లో కచ్చా రోడ్డు ఉంటే దానిని బ్లాక్ చేసి ఆ మార్గాన్ని మూసేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ మండలం ఇన్నర్ రింగురోడ్డులోని ఉప్పరపల్లిలో ఉన్న పీఎంఆర్ అపార్టుమెంట్‌కు చేరువలో రహదారులను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపడుతున్నారని, దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని పీఎంఆర్ అపార్ట్‌మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మహేశ్వరం మండలం సర్దార్ నగర్‌లో హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లే–ఔట్‌లోని ప్లాట్లు రావిర్యాల చెరువులో మునిగిపోతున్నాయని, వెంటనే ఆ చెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్థారించి తమ ప్లాట్లను కాపాడాలని స్థానికులు కోరారు. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ అవసరమైన చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సిటీలో ఎక్కడికక్కడ ఆక్రమణలు ప్రజావాణి ద్వారా హైడ్రాకు 44 ఫిర్యాదులు


