హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు హెచ్చరిక
ఏకపక్షంగా చర్యలు చేపడితే ఇబ్బందులు తప్పవు
కూల్చివేతలు వద్దని చెప్పినా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా?
న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు
ధిక్కార కేసులో వర్చువల్‌గా హాజరైన కమిషనర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హైకోర్టు మరోసారి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను హెచ్చరించింది. నీటివనరుల రక్షణ, సరస్సుల పునరుజ్జీవం పేర ఏకపక్షంగా, చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. అధికారం చూపించడానికి బాధ్యతలు కట్టబెట్టలేదనే విషయాన్ని గుర్తెరిగి పనిచేయాలని సూచించింది. న్యాయస్థానం తీవ్ర చర్యలకు ఉపక్రమించేలా వ్యవహరించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. ఖానామెట్‌లోని తమ్మిడికుంట సమీపంలోని భూముల్లో పనులకు సంబంధించి కోర్టు జారీ చేసిన యథాతథ స్థితి ఆదేశాలను ఉల్లంఘించడంపై హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణకు వర్చువల్‌గా హాజరైన రంగానాథ్‌పై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మంచి పేరుతో హాని వద్దు
హైడ్రాపై మీ అభిప్రాయం ఏంటని, సరస్సుల పునరుజ్జీవనంలో మీ పాత్ర ఏంటని రంగనాథ్‌ను ధర్మాసనంఅడిగింది. ఉల్లంఘనలు, ఆక్రమణలపై ఫిర్యాదులతో ప్రజలు హైడ్రా వద్దకు వస్తున్నారని.. తర్వాత తీసుకున్న చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారని రంగనాథ్ బదులిచ్చారు. కూల్చివేతలప్పుడు చట్టవిధానం పాటించారా.. పార్టీలకు నోటీసులు జారీ చేసి, విచారణకు అవకాశం ఇవ్వరా అని ధర్మాసనం ప్రశ్నించింది. కూల్చివేతలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉదహరించింది. వాటిని మీరు ఎందుకు అనుసరించరు.. మీరు అనుసరిస్తే, ప్రజలు కోర్టుకు ఎందుకు వస్తున్నారని అడిగింది.
ఈ దేశంలో ధనిక వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా భూమిపై పెట్టుబడి పెడతారని, వారు తెలిసీ తెలియక ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో కొనుగోలు చేసి ఉండొచ్చని పేర్కొంది. అలాంటి వారికి నోటీసులైనా జారీ చేయకుండా నడిరోడ్డుపై నిలబెడుతున్నారని.. చట్టాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్లు కూల్చివేస్తున్నారంది. మంచి చేయడం పేరుతో ఇతరులకు హాని చేయవద్దంది. 50 నుంచి 100 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన చిన్న షెల్టర్లను అధికారులు తరచుగా వారాంతాల్లో నోటీసు లేకుండా కూల్చివేసిన ఘటనలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
నిర్ధారించే అధికారం హైడ్రాకు లేదు..
కొందరి నిర్మాణాలను మీరు చెప్పాపెట్టకుండా కూల్చివేస్తారు.. మరికొందరివి మాత్రం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల కింద క్రమబద్దీకరిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం, ప్రక్రియను పాటించకపోవడం లాంటి పిటిషన్లు ఇకపై రాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏప్రిల్‌లో కోర్టు ఆదేశాలు జారీ చేసినా హైడ్రా పనులు కొనసాగించిందన్నారు. సరస్సుల పునరుద్ధరణ, పునరుజ్జీవనం ముసుగులో హైడ్రా తమ భూములను ఆక్రమించుకునేందుకు కుట్ర పన్నిందన్నారు. కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణకు ఎలాంటి సర్వే నిర్వహించకుండా పిటిషనర్ల భూములను ముంపునకు గురిచేసి నిరుపయోగంగా మార్చిందని నివేదించారు. అవి అసైన్‌మెంట్ భూములని హైడ్రా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. భూమి వర్గీకరణ నిర్ధారించే ఎలాంటి అధికారం హైడ్రాకు లేదన్నారు.
⇒ ‘సచివాలయంలో ఉండే వారు సామాజిక, ప్రజల అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా లేదా వాటిని మరిచిపోతున్నారా? అధికారం ఉండగా కొన్ని మంచి పనులైనా చేసి మానవతావాదులుగా నిలవండి. అధికారులు తమ శక్తిని సామాన్యులపై ప్రదర్శించాలని చూస్తే కోర్టులు అంతకంటే శక్తిమంతమైనవని మరవొద్దు. అలాంటి అధికారాలను న్యాయస్థానాలు వినియోగించే పరిస్థితి తేవద్దు.’
⇒ ‘కూల్చివేతల పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తాం.. కోర్టు ఆదేశాలను పట్టించుకోం.. అంటే తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హైడ్రాపై ధిక్కరణ కేసులు రోజూ ఈ కోర్టుకు వస్తూనే ఉన్నాయి. న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలను పాటించకపోయినా.. ఉల్లంఘించినా ఎలా స్పందించాలో కూడా తెలుసు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, మురుగు నీటిపారుదల బోర్డు, రెవెన్యూ, రోడ్లు, అనధికార, అక్రమ నిర్మాణాలు.. ఇలా అన్ని ఇతర విభాగాల్లో ఇష్టం వచ్చినట్లు జోక్యం చేసుకునే అధికారం హైడ్రాకు ఉందా?’ –కమిషనర్ రంగనాథ్‌తో ధర్మాసనం


