ఈ సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే! | Telangana Minister Komatireddy Review Meeting On Traffic Management And Issued Guidelines For Sankranti 2026 Rush | Sakshi
Sakshi News home page

ఈ సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే!

Dec 30 2025 2:00 PM | Updated on Dec 30 2025 3:44 PM

Telangana Minister Komatreddy Review Meeting On Sankranti 2026 Rush

సాక్షి, హైదరాబాద్‌: గత అనుభవాల దృష్ట్యా ఈసారి పండుగ ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు, ఆర్‌ అండ్‌ బీ అధికారులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ట్రాఫిక్‌ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా ఉన్నారు. హైదరాబాద్ - విజయవాడ హైవే పై జనవరి 8వ తేదీ నుంచి వాహన రద్దీ ఎక్కువ ఉండొచ్చు. ప్రధానంగా ఎల్బీనగర్ నుండి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీ ఏర్పడుతుంది..ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు. సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోయినసారి ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుంది. కాబట్టి దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. 

పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్‌లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు చేయొద్దు. అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలి. పండుగ మొదలుకానున్న తేదీకి ముందే రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలి. అన్ని రహదారి లేన్‌లు వాహనాల రాకపోకలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి. పగలు, రాత్రి రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి స్పష్టంగా చూపాలి.

ఎక్కడా ట్రాఫిక్‌కు అయోమయం కలిగించే ఏర్పాట్లు ఉండకూడదు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలి. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం పాటించాలి. అన్ని సంబంధిత శాఖలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలి. రోడ్డు పనుల్లో ఉన్న సిబ్బంది అందరూ ప్రతిబింబించే జాకెట్లు (పసుపు / నారింజ రంగు) తప్పనిసరిగా ధరించాలి.

రాత్రి సమయంలో జంక్షన్లు, వర్క్ జోన్‌ల వద్ద తగినంత వెలుతురు ఏర్పాటు చేయాలి. బారికేడ్లు, ట్రాఫిక్ ఐలాండ్‌లపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. రూట్ పేట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంచాలి. అన్ని రహదారి ఘటనలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా సజావుగా వెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలి. రేపు నేను తూప్రాన్ పేట్,అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తా అని తెలిపారాయన.  

కేంద్రానికి ఫ్రీ వే రిక్వెస్ట్‌
సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ‘‘పండుగ పూట లక్షలాది మంది ప్రయాణం చేస్తారు.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రభుత్వ ఆలోచన. ఈ అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఇవాళ లేఖ రాస్తా. అవసరమైతే ఒకటి,రెండు రోజుల్లో నేను స్వయంగా వెళ్ళి కలుస్తా. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతా. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే వాహనాలు ఆగవు..ఎలాంటి అసౌకర్యం ఉండదు’’ అని తెలిపారాయన. 

ఈ సమీక్ష సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,NHAI రీజినల్ అధికారి శివ శంకర్, MoRTH రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్,డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీ,పలువురు పోలీస్ ఉన్నతాధికారులు,ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సిలు జయభారతి, మోహన్ నాయక్, ఎస్.ఈ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement