డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు: మంత్రి పొంగులేటి | Telangana Minister Ponguleti Gives Clarity On Desk Journalists Issue Over GO 252, Check More Details Inside | Sakshi
Sakshi News home page

డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు: మంత్రి పొంగులేటి

Dec 30 2025 1:40 PM | Updated on Dec 30 2025 2:59 PM

Telangana Minister Ponguleti Clarity on Desk Journalists Issue

సాక్షి, హైదరాబాద్‌: అక్రిడేషన్‌ల విషయంలో జీవో 252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్‌ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో.. వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలంటూ టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్టీ నేతలు  మంగళవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. 

డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని, జీవో 252ను సవరించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే.. స్పోర్ట్స్, కల్చరల్, ఫీచర్ ప్రతినిధులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

రిపోర్టర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తా. ఆ అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తా. జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా జీవో 252ను వివరిస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ఫెడరేషన్‌ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అక్రిడిటేషన్ల జీవో నెంబర్ 252పై పలువురు జర్నలిస్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం.. ఫీల్డ్ రిపోర్టర్లకు ‘అక్రిడిటేషన్ కార్డు’, డెస్క్ జర్నలిస్టులకు కేవలం ‘మీడియా కార్డు’ జారీ చేయాలని నిర్ణయించింది. ఒకే వృత్తిలో ఉన్న వారిని రిపోర్టర్లు, డెస్క్ అని రెండు వర్గాలుగా విభజించడం జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడమేనని ఇటు జర్నలిస్ట్‌ సంఘాలు మండిపడుతున్నాయి. 

ఇక.. మీడియా కార్డు వల్ల రైల్వే, బస్సు పాస్ రాయితీలు, టోల్ గేట్ మినహాయింపులు వంటి కనీస ప్రయోజనాలు కూడా అందే అవకాశం లేదని డెస్క్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నట్లుగానే డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జీవో వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని యూనియన్లు అంటున్నాయి. ఈ క్రమంలో.. జీవో విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టులో పోరాటానికి సిద్ధమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement