
ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల స్టాల్‌ను పరిశీలిస్తూ.. ముచ్చటిస్తున్న సీఎం
ప్రైవేటుకు మించి ప్రభుత్వ స్కూళ్లు రాణించాలి
ప్రక్షాళన కోసమే విద్యాశాఖను నేను తీసుకున్నా
తెలంగాణకు ప్రత్యేక విద్యా విధానం కోసం కమిటీ వేశాం
టీచర్లు బాగా పనిచేస్తే నేను మళ్లీ సీఎం అవుతా
విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
గురుపూజోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యారంగాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని, దీని కోసం ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరికొత్త విద్యావిధానం రూపొందించేందుకే ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ రంగానికి మించిన నాణ్యతతో ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని కోరారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలకోపన్యాసం చేశారు.
గత పదేళ్లలో విద్యాశాఖ నిర్వీర్యమైందని, చారిత్రక ప్రాధాన్యత గల ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే దశకు చేరి ందన్నారు. విద్యా శాఖను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యా విధానంలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షించాలన్న ఉద్దేశంతోనే దానిని తన వద్ద ఉంచుకున్నానని సీఎం తెలిపారు.
దీనిపై కొంతమంది చేస్తున్న విమర్శలు అర్థం లేనివని కొట్టిపారేశారు. పదేళ్లుగా ఈ శాఖ అస్తవ్యస్తమైందని విమర్శించారు. ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్సిటీలను నీరుగార్చారని ఆరో పించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే టీచర్ల బదిలీలు, 55 రోజుల్లోనే 11 వేల మంది టీచర్ల నియామకాలు చేపట్టామని చెప్పారు.
టీచర్లు బాగా పనిచేస్తే మేము మళ్లీ గెలుస్తాం
తెలంగాణ ఉద్యమాన్ని పల్లెలకు తీసుకెళ్లిన ఘనత టీచర్లదేనని సీఎం అన్నారు. ‘ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి విద్యాభివృద్ధే కారణం. నాలోనూ ఆ స్వార్థం ఉంది. టీచర్లు బాగా పనిచేస్తేనే నేను రెండోసారి సీఎం అవుతాను. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడొచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసినవారు. టీచర్లకు జీతాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. పాఠశాలల నిర్వహణకు ఏటా రూ.130 కోట్లు మంజూరు చేస్తున్నాం’అని తెలిపారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేయండి
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొన్నిసార్లు విషపూరితం కావటం దురదృష్టకరమని సీఎం అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలతో కలసి ఉపాధ్యాయులు భోజనం చేయాలని కోరారు. అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అప్పుడప్పుడు తాను కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగాయని చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ కన్నా మంచి విద్యను అందిస్తామని టీచర్లు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు.
బలమైన పునాది అవసరం
విద్యకు బలమైన పునాది అవసరమని సీఎం అన్నారు. ‘విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవడం కీలకం. దీని దృష్టిలో ఉంచుకునే వరల్డ్ బెస్ట్ మోడల్‌గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశాం. దేశ ప్రతిష్టను పెంచేలా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం’అని వివరించారు.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్ తెస్తున్నామని ప్రకటించారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురుపూజోత్సవ విశిష్టతను, గురువులకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్సీలు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కార్యదర్శి దేవసేన తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అవార్డులు అందించారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.