
మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు
బంద్‌లో పాల్గొననున్న కుల సంఘాలు, ప్రజాసంఘాలు
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా శనివారం తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రబంద్‌కు అన్ని రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలంటూ పార్టీలు... వారి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇవ్వడం, ఆ దిశగా అసెంబ్లీలో చట్టాలు చేసి కేంద్రానికి పంపడం... మరోవైపు ఆర్డినెన్స్ జారీ చేసినా, గవర్నర్ ఆమోదించకపోవడం...చివరకు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయగా... వాటిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
బీసీలకు కేవలం స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ పెరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఈనెల 12న బీసీ జేఏసీ ఏర్పాటైంది. ప్రజాజీవనాన్ని స్తంభింపజేసి బీసీల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకే రాష్ట్రబంద్ నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల మద్దతును కోరారు.
బీసీ జేఏసీ నిర్ణయం మేరకు ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచి్చన వెంటనే ప్రధాన రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు ప్రకటించడంతోపాటు రాష్ట్ర బంద్‌లో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశించారు.
మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు సైతం క్షేత్రస్థాయిలోని నాయకత్వానికి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్రంలోని ప్రజాసంఘాలన్నీ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న బంద్‌కు అన్ని పక్షాల మద్దతు లభించడం ఇదే తొలిసారి.