
మీడియాతో మాట్లాడుతున్న మారం జగదీశ్వర్
ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి వెల్లడి
సీఎం చెప్పినట్టుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు
ఆరోగ్య కార్డులకు అతీగతీ లేదు.. డీఏల విడుదల లేదు
సెప్టెంబర్ 1 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్న జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 15న సమర శంఖం పూరిస్తామని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీఈజేఏసీ) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించకపోవడంపై.. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీ సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లభించలేదని అన్నారు. శనివారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్‌లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం ఆదేశాలు అమలు కావడం లేదు..
‘సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లులకు సంబంధించి నెలకు రూ.700 కోట్లు చెల్లించాలి. కానీ గత నెలలో కేవలం రూ.183 కోట్ల మేర మెడికల్ బిల్లులు క్లియర్ చేశారు. ఈ నెలతో కలిపి రూ.1,217 కోట్లు చెల్లించాల్సి ఉండగా తాత్సారం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఉద్యోగుల గోడును విన్నవించినా...ఆయన పెడచెవిన పెట్టారు. ఈహెచ్‌ఎస్ పథకంలో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ.. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈహెచ్‌ఎస్ అమలుకు మోకాలడ్డుతున్నారు.
ఉద్యోగులకు వ్యతిరేకంగా అధికారులు?
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీకి టీజీఈజేఏసీ ఇచ్చిన 57 డిమాండ్లకు సంబంధించిన నివేదికను బయటపెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కొన్ని శాఖల్లో ఉద్యోగుల ఖాళీలను తగ్గిస్తూ డౌన్‌సైజ్ చేయా లని చూడటం దుర్మార్గం. సీఎం, మంత్రి మండలి ఆదేశాలను గౌరవించాల్సిన అధికారులందరూ ఉద్యోగులకు వ్యతి రేకంగా పనిచేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి ఆగస్టు 15వ తేదీలోగా తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే 15వ తేదీ నుంచి నిరసనలు చేపడతాం. పెన్షన్ విద్రోహదినంగా నిర్వహిస్తున్న సెపె్టంబర్ 1వ తేదీ తర్వాత జేఏసీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం..’అని జేఏసీ నేతలు వెల్లడించారు.
జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవీ..
⇒ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన నెలవారీ నిర్దేశిత బడ్జెట్ క్రమం తప్పకుండా విడుదల చేయాలి.
⇒ రెండు నెలలుగా చెల్లించాల్సిన రూ.1,217 కోట్లు ఈ నెలలోనే ఇవ్వాలి.
⇒ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ( ఉఏ ) జూలై నెలాఖరులోపే పూర్తిస్థాయిలో నిబంధనలను రూపొందించి అమలు చేయాలి.
⇒ పెండింగ్‌లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి.
⇒ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
⇒ ఏకీకృత సర్విసు నిబంధనలను అమలు చేసేందుకు తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.
⇒ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి.
⇒ గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాలి.