
సమావేశంలో కృష్ణయ్య, జాజుల ఇతర బీసీ నాయకుల సంఘీభావం
చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్‌గా వీజీఆర్ నారగోని
కో చైర్మన్లుగా రాజారాంయాదవ్, దాసు సురేశ్ ఎన్నిక
ఈ నెల 14న తలపెట్టిన బంద్ వాయిదా.. 18న రాష్ట్ర బంద్‌కు జేఏసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునే లక్ష్యంతో తెలంగాణ బీసీ ఐక్యకార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) ఏర్పాటైంది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావుల ప్రత్యేక సమావేశం జరిగింది. బీసీ జేఏసీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగగా, సభ్యులంతా ఏకగ్రీవంగా జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్‌గా వీజీఆర్ నారగోని, కో చైర్మన్లుగా రాజారామ్‌యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఈనెల 13న తలపెట్టిన రహదారుల దిగ్బంధం, 14న చేపట్టబోయే రాష్ట్ర బంద్ వాయిదా వేశారు. ప్రస్తుతం జేఏసీ ఏర్పాటు కాగా, అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా జేఏసీ కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది.
బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలంటే ప్రతి బీసీ పౌరుడు పోరాడాలని జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు స్టే విధించి రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం చేసిందన్నారు. వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60% బీసీలు ఉన్నా... వారంతా ఐక్యంగా లేరన్నారు. అందువల్లే బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు నోటివరకు వచ్చినా, అడ్డుకోగలిగారని చెప్పారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పుట్టించేలా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో 40 బీసీ సంఘాలు, 110 బీసీ కుల సంఘాలతోపాటు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య, శేఖర్ సగర, నీల వెంకటేశ్ పాల్గొన్నారు.