
ప్రభుత్వ పెద్దలూ, ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలూ ఒక నిర్ణయం తీసుకున్నాయంటే దాని వెనుక ఏదో మతలబు ఉంటుంది అనే అనుమానం వ్యక్తం చేయ వలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పంచాయితీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు కేటాయించే ఆర్డినెన్స్‌ను జారీ చేయడాన్ని అందుకే అనుమానించాల్సి వస్తోంది. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై ఇప్పటి దాకా మౌనం పాటించిన ప్రభుత్వం హఠాత్తుగా పంచాయితీ ఎన్ని కలకు ముందు, ఆర్డినెన్స్ జారీ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
అసలు ఇది రాజ్యాంగ విరుద్ధమనే విషయాన్ని ముందు ప్రజలు తెలుసుకోవాలి. ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రయత్నిస్తున్నదని అర్థం చేసుకోవాలా? కావాలనే రాజకీయ చాణక్యంతో చేసిన వ్యూహ రచనా? సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్ల కోటా 50% మించి ఉండరాదనే పరిమితీ, పలు రాజ్యాంగ నిబంధనలు ఇటువంటి ఆర్డినెన్స్‌ల జారీ సరికాదనీ సూచిస్తున్నా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు?
ప్రజలు అమాయకులని ప్రభుత్వం భావిస్తున్నదా?
కె. కృష్ణమూర్తి అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్‌ఇండియా అండ్ అనదర్ (2010) తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ప్రిన్సి పుల్ చెప్పిన సుప్రీంకోర్టు... వికాస్ కిశన్‌రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం (2021) కేసులో ముఖ్యమైన ప్రమాణా లను నిర్దేశించింది.
ట్రిపుల్ టెస్ట్ ప్రిన్సిపుల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజ ర్వేషన్‌కు సంబంధించినది. మరీ ముఖ్యంగా ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌కు సంబంధించినది. ఇందులో మూడు అంశాలు ఉన్నాయి. ఒక నిర్ధారిత స్థానిక సంస్థ పరిధిలో ఉన్న ఓబీసీల వెనుకబాటు తనాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఒక కమిషన్‌ను నియమించాలి. కమిషన్ రికమండేషన్లను పరిగణనలోకి తీసుకుని అవసరమైన రిజర్వేషన్ నిష్పత్తిని నిర్ణయించడం రెండోది. రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50 శాతానికి మించకుండా చూడటం మూడోది. అయితే అత్యవసర పరిస్థితులలో మాత్రమే, స్పష్టమైన ఆధారాలు,సంఖ్యా పరమైన డేటా ఉంటే మినహాయింపు ఇవ్వవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన కులగణనలో బీసీ జనాభా 56% అని తెలిపినా, అధ్యయన నివేదికను గోప్యంగా ఉంచడం అను మానాలకు కారణమైంది. రెండు ముఖ్యమైన బిల్లులు (విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు) రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. వాటిని రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపించారు కూడా. కానీ రాష్ట్రపతి ఏం చేస్తారో చెప్పలేం.
ఎందుకంటే తమిళనాడు చట్టాలు చేసిన బిల్లులను, ఆర్డినెన్సు లను ధర్మాసనాలు విని, నిర్ణయించి ఈ విధంగా వేధించకండి అని స్పష్టం చేశాయి. అయినా రాష్ట్రపతికి సలహా కోసం మళ్లీ సుప్రీంకోర్టు పెద్దలకు పంపించడం మరో చాణక్యమే.
మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభను ప్రోరోగ్ చేసి, సాయంత్రం గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపించడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసే ప్రయత్నంగా చూడాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 213(1)(ఏ) ప్రకారం, రాష్ట్రపతి అనుమతి అవస రమైన అంశంపై గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయలేరు. కాబట్టి, ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమయ్యే అవకాశాలు బోలెడు.
ఇంద్రా సహానీ కేసు (1992)లో సుప్రీంకోర్టు 50% రిజ ర్వేషన్ పరిమితి విధించింది. ఇదే చరిత్రలో మండల్ కమిషన్ కేసుగా ప్రసిద్ధం. కృష్ణమూర్తి, గవాలి కేసుల్లో ఇదే నియమాన్ని పునరుద్ఘాటించింది. మరాఠా రిజర్వేషన్ కేసు (2021)లో కోర్టు ఇలా చెప్పింది: ‘50 శాతానికి మించటం అనేది నియమం కాదు. అతీ తమైన పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు.’ దీన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకులు అర్థం చేసు కోవాలి.
సర్వే వివరాలు దాయడం ఎందుకు?
తెలంగాణ ప్రభుత్వం డేటా గోప్యంగా ఉంచడం, అత్య వసర పరిస్థితి ఆధారాలు చూపకపోవడం వల్ల ఈ నిర్ణయం న్యాయపరంగా బలహీనం అయిపోతున్నది. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి రానున్న పంచాయితీ ఎన్నికలు కారణం కావచ్చు. బీసీ ఓటుబ్యాంక్‌ను ఆకట్టుకోవడానికి ఇదొక ఎత్తుగడై ఉంటుందనే అను మానం. బీసీ సాధికారత తప్పనిసరి అయినా, రాజ్యాంగ పరిమితులు, పారదర్శకతను విస్మరించి తీసుకున్న ఈ నిర్ణయం సమస్యాత్మకం.
ఆర్టికల్స్ 243డి (6), 243టి (6) అనేవి స్థానిక సంస్థల రిజర్వేషన్ విధానాన్ని స్పష్టంగా నిర్ధారించాయి. అయితే విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబాటు వేరు, రాజకీయ వెనుకబాటు వేరు అని ఇవి స్పష్టం చేశాయి. కాబట్టి వీటిని ఉటంకించి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళితే ఓ ఆట అడుకుంటారు. కావాలని కోర్టులో ఓడిపోయే విధంగా చట్టాలు, ఆర్డినెన్సులు చేయడం అంటే కాల క్షేపం చేయడమే తప్ప మరేమీ కాదు.
చివరకు మిగిలేది, తగిలేది ఒకే ప్రశ్న: సామాజిక న్యాయం పేరుతో రాజ్యాంగ నియమాలను అతిక్రమించవచ్చా? సమాధానం కోర్టుల తీర్పులో తెలుస్తుంది. రాజ్యాంగం పట్ల గౌరవం కోల్పోతే, ప్రజాస్వామ్య విశ్వసనీయత దెబ్బ
తింటుంది.
-వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్