
సమావేశంలో మాట్లాడుతున్న మారం జగదీశ్వర్. చిత్రంలో ఏలూరు శ్రీనివాసరావు, మధుసూదన్ రెడ్డి, ఇతర సంఘాల నేతలు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పోరుబాట
సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ
ఈ నెల 15 నుంచి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు
జూన్ 9న హైదరాబాద్‌లో 50 వేల మంది ఉద్యోగులతో మహాధర్నా
వర్క్ టు రూల్, పెన్ డౌన్, సామూహిక సెలవులతో సర్కారుపై ఒత్తిడి
16 నెలలు వేచి చూసినా ఫలితం లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే ఆందోళనల బాట అంటున్న నేతలు
జేఏసీ తీర్మానాలు ఇవీ...
⇒ పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.9 వేల కోట్ల బిల్లులు యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయాలి.
⇒ పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి.
⇒ ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలి.
⇒ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
⇒ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి.
⇒ స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి.
⇒ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి.
⇒ ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులకు తిరిగి పూర్వ ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలి.
⇒ 2025 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల సాధారణ బదిలీలను మే/జూన్‌లోనే నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ పోరుబాట పట్టింది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై 16 నెలలుగా చేసిన ఒత్తిడి ఫలించకపోవడం, ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడటంతో ప్రత్యక్ష కార్యాచరణకు నడుం బిగించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. దశల వారీగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడమే కాకుండా జూన్ 9న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వర్క్ టు రూల్, పెన్ డౌన్, సామూహిక సెలవులు వంటి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ సంఘాల ఉమ్మడి కార్యాచరణ సమితి రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. జేఏసీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా జరిగిన ఈ సమావేశంలో 33 జిల్లాల జేఏసీ ప్రతినిధులు, సచివాలయ జేఏసీతో పాటు 206 అనుబంధ సంఘాల నేతలు పాల్గొని ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు.
క్షేత్రస్థాయి నుంచి షురూ..
క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణ యం తీసుకున్న జేఏసీ..ఈనెల 15వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనుంది. జిల్లాల వారీగా తేదీలు ఖరారు చేసుకుని ఆయా రోజుల్లో ఆందోళనలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి నాయకులు వీటిల్లో పాల్గొంటారు. ఇవి పూర్తయిన తర్వాత కొత్త జిల్లా కేంద్రాల్లో ఉమ్మడి జిల్లా నేతలతో ఆందోళన కార్యక్రమాలు చేపడ తారు. ఇవి పూర్తయ్యాక జూన్ 9వ తేదీన హైదరాబాద్‌లో సుమారు 50 వేల మంది ఉద్యోగులతో మహా ధర్నా నిర్వహిస్తామని టీజేఏసీ ప్రకటించింది.
ఉద్యమంలో భాగంగా వర్క్ టు రూల్ (పనివేళలో మాత్రమే విధులు), మండలాలు, తాలూకా, జిల్లా కేంద్రాల్లో మానవ హారాలు, ప్రభుత్వ కార్యా లయాల ముందు సామూహిక భోజనాలు, ఆ తర్వాత పెన్‌డౌన్ (హాజరు రిజిస్టర్‌లో సంతకం చేసి విధులకు గైర్హాజరు కావడం), అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 13.31 లక్షల మంది ఉద్యోగులు ఒకరోజు సామూ హిక సెలవుకు దిగడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. తమ సమస్యలకు సంబంధించి టీజేఏసీ 57 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఇందులో 45 డిమాండ్లు ఆర్థికేతరమైనవే.
కేవలం 12 మాత్రమే ఆర్థికపరమైనవి. ఆర్థిక ఇబ్బందులున్నప్పడు కనీసం ఆర్థికేతర అంశాలనైనా పరిశీలించి వాటిని పరిష్కరించకపోవడంతోనే ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నట్లు ఉద్యోగ జేఏసీ స్పష్టం చేసింది. ఈ సదస్సులో ఉద్యోగ సంఘాల నేతలు జి.సదానందం గౌడ్, చావ రవి, కె. గౌతమ్‌కుమార్ పి.దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 20న జరిగే అఖిల భారత ఉద్యోగుల సార్వత్రిక సమ్మెకు టీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ప్రభుత్వం పట్టించుకోనందుకే..
మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తక్షణ పరిష్కారం కోసం ఒత్తిడి చేశాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కొన్నిరోజులు వేచిచూడాలని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులున్నందున మేము కూడా ఓపిక పట్టాం. కానీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తోంది. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీనిపై ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాం. కొందరు మంత్రులు గంటల తరబడి వెయిట్ చేయిస్తూ చివరకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయి ఉద్యోగులు మాపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. వారిలో ఓపిక నశించింది. కొందరిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనల బాట పట్టాం. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరిస్తే పునరాలోచన చేస్తాం. – మారం జగదీశ్వర్, టీజేఏసీ చైర్మన్
పరిష్కారం లేదు..చర్చల్లేవు
మా సమస్యల పరిష్కారం కోసం 16 నెలలుగా ఎదురు చూశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినప్పటికీ.. ఒక్కసారి కూడా చర్చలకు పిలవలేదు. సీఎంను ఒకట్రెండుసార్లు కలిసి పరిస్థితిని వివరించినప్పుడు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు. ఆర్థిక పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుంది? మా సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది? – ఏలూరి శ్రీనివాసరావు, టీజేఏసీ సెక్రెటరీ జనరల్