
సాక్షి, హైదరాబాద్: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు.. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

బీఆర్‌ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది.