
హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, అందులో దాపరికాలు ఏం లేవని అన్నారాయన.
విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియా నుంచి ఈ వ్యవహారంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. గత కొంతకాలంగా మా పార్టీ పైన, నా పైన కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి.
ఆ వ్యాఖ్యలనే కవిత ప్రస్తావించారు. వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు’’ అని అన్నారాయన.
ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు. మరొకవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంత ఉంటుంది. మేం ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళు కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళు, సో, మా సమయాన్ని అంత కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటాం. ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం అని హరీష్‌రావు అన్నారు.
ఇదిలా ఉంటే.. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లే తాను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యానని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ క్రమంలో హరీష్‌రావుకు బంగారు తెలంగాణపై చిత్తశుద్ధి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. హరీష్‌రావు మొదటి నుంచి పార్టీలో ఏం లేరని, బీఆర్‌ఎస్‌పై ఎప్పటి నుంచో హరీష్‌రావు కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్..బీజేపీలతో టచ్‌లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని, స్వలబ్ధి కోసమే తనను బయటకు పంపించేశారని ఆరోపించారామె. ఆరడుగుల బుల్లెట్టుగా బీఆర్‌ఎస్ అభివర్ణిస్తున్న హరీష్‌రావు తనకు గాయం చేశారని పేర్కొంటూ.. ఈ క్రమంలో హరీషన్నతో జాగ్రత్త అంటూ కేసీఆర్, కేటీఆర్‌లకు సూచిస్తూ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారామె.
