
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్ధి దాదాపు ఖాయం అయ్యాడనుకున్న తరుణంలో.. మహమ్మద్ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీకి ఎంపిక చేసి కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో మళ్లీ మల్లాగుల్లాలు పడుతూ మొదటికొచ్చింది. ఈలోపు.. బీఆర్‌ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తూ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో నెగ్గి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందర హైదరాబాద్‌లో తమ బలం ఏమాత్రం తగ్గలేదని రాజకీయ ప్రత్యర్థులకు చూపించాలని ఆయన భావిస్తున్నారు. ఈలోపు.. సోమవారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
బీఆర్‌ఎస్ మాజీ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పీజేఆర్ తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరూ అరగంటకు పైగా చర్చ జరపడంతో జూబ్లీహిల్స్ టికెట్ కోసమేననే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
పీ జనార్ధన్ రెడ్డి తనయుడు పీ విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి మరణానంతరం 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 2009లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవచ్చనే సంకేతాల నడుమ.. ఆయన కవితతో భేటీ అయ్యారన్నది తాజా ఊహాగానాల సారాంశం. అయితే..
ఈ పుకార్లకు విష్ణు పుల్‌స్టాప్ పెట్టారు. పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితకు ఆహ్వాన పత్రిక అందించడానికే వచ్చినట్లు చెప్పారాయన. ‘‘కేటీఆర్‌తోనే నా ప్రయాణం. ఎప్పుడు నేను ఇదే చెబుతా. కేటీఆర్‌కు ప్రమోషన్ ఉంటుంది.. నాకూ ప్రమోషన్ ఉంటుంది’’ అని ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే విష్ణు తోసిపుచ్చారు.
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ ప్రెస్‌మీట్‌లో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. వేరే పార్టీలో చేరిక.. సొంత పార్టీ గురించి స్పష్టత ఇవ్వని ఆమె.. ఇక నుంచి రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్ ఫొటోతోనే ముందుకు సాగుతానని ఆమె ప్రకటించడం గమనార్హం.