
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని కవిత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కూడా కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందే. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు సపోర్ట్ చేశాను. అలాగే, తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను నేను జనాభా లెక్కల నుంచి తీసివేశాను అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కమీషన్ల కోసమే బనకచర్ల..
అనంతరం, బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏం లాభం లేదు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు. ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం.
సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు. సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు. రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు. ఆయనకు పాలించే హక్కు లేదు. తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు.

బాబుకు బహుమతిగా గోదావరి నీళ్లు..
పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌లో అని సీఎం చెప్తుంటారు. ముఖ్యమంత్రి ఇంకా కాలేజీలోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్టుగా ఇచ్చారు. తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ, ఆంధ్రాకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు.. వారికి బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశారు.