ఇది మూడోసారి! | Hyderabad: 3 time Rave party at Moinabad farmhouse | Sakshi
Sakshi News home page

ఇది మూడోసారి!

Mar 16 2026 5:37 AM | Updated on Mar 16 2026 5:37 AM

Hyderabad: 3 time Rave party at Moinabad farmhouse

వార్తల్లోకి అజీజ్‌నగర్‌ ఫామ్‌హౌస్‌ 

2022లో ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం 

2024లో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు 

తాజాగా డ్రగ్స్‌ పార్టీ, ప్రముఖుల అరెస్టుతో కలకలం

సాక్షి, హైదరాబాద్‌: ఏలూరు ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత పుట్టా మహేశ్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్న రేవ్‌ పార్టీతో మెయినాబాద్‌ అజీజ్‌నగర్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. గడిచిన ఐదున్నరేళ్ల కాలంలో ఇది వివాదాస్పదం కావడం ఇది మూడోసారి. కాగా పైలెట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఈ ఫామ్‌హౌస్‌లో తాజాగా రేవ్‌ పార్టీకి తోడు కాల్పుల కలకలం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.  

తొలిసారి..: ఈ ఫామ్‌హౌస్‌ తొలిసారిగా 2022 అక్టోబర్‌లో వార్తల్లోకి ఎక్కింది. ఆ నెల 26 రాత్రి నిఘా విభాగం, సైబరాబాద్‌ పోలీసులు భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న తిరుపతికి చెందిన సింహయాజులు, ఫరీదాబాద్‌లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి, హైదరాబాద్‌ వాసి నందకుమార్‌లను పట్టుకున్నారు. అక్కడ మొదలైన ఈ కథ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు, రోహిత్‌రెడ్డి సహా అనేక మంది విచారణ వరకు వెళ్లింది. ఈ ‘ఎర’కు సంబంధించిన ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు సీబీఐ, సిట్‌ల్లో ఎవరు దర్యాప్తు చేయాలనే అంశంపై ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది.  

మలిసారి..: రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ట్యాపింగ్‌పై 2024 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన సిట్‌ కొన్ని కీలకాంశాలు గుర్తించింది. 2022లో మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ జరిగిన ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే బయటకు వచ్చినట్లు తేల్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్‌ చేయడం ద్వారానే ఈ విషయాన్ని నాటి నిఘా వర్గాలు గుర్తించినట్లు సిట్‌ తేల్చింది. అందుకు అవసరమైన ఉపకరణాలను సైతం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించింది.  

తాజాగా..: ఈ ఫామ్‌హౌస్‌లో శనివారం మధ్యాహ్నం మొదలైన రేవ్‌ పార్టీ రాత్రి వరకు కొనసాగింది. ఈగల్, ఫ్యూచర్‌ సిటీ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో రోహిత్‌రెడ్డి, పుట్టా మహేశ్‌ సహా 11 మంది చిక్కారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చింది. పోలీసుల దాడికి ముందు కాల్పులు సైతం చోటు చేసుకోవడంతో ఈ కేసులో మాదకద్రవ్యాల చట్టంతో పాటు ఆర్మ్స్‌ యాక్ట్‌ను జోడించారు. పుట్టా మహేశ్, రోహిత్‌ రెడ్డి సహా ఇతర నిందితులను మొయినాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement