డ్రగ్స్‌కు పూర్తిగా వ్యతిరేకం | KTR Reacts to Drugs Allegations | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌కు పూర్తిగా వ్యతిరేకం

Mar 16 2026 5:17 AM | Updated on Mar 16 2026 5:19 AM

KTR Reacts to Drugs Allegations

‘ఎక్స్‌’లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

బాధ్యతాయుత పదవుల్లో ఉండి డ్రగ్స్‌ వాడడం దురదృష్టకరం 

ప్రతి డ్రగ్స్‌ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే చట్టపరంగా నోటీసులిస్తా

సాక్షి, హైదరాబాద్‌: మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్‌ వాడకానికి పాల్పడటం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి డ్రగ్స్‌ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులిస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  

అందరికీ ఆదర్శంగా నిలుద్దాం 
‘డ్రగ్స్, ఇతర అక్రమ పదార్థాల వాడకానికి నేను పూర్తిగా వ్యతిరేకం. మా పార్టీ బీఆర్‌ఎస్‌ డ్రగ్స్‌ వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్‌ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారు (పెడ్లర్లు), వారి రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించబడాలి. అయితే నీచమైన రాజకీయాల కోసం మా పార్టీ బీఆర్‌ఎస్‌ను ఇందులోకి లాగుతున్న తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. డ్రగ్స్‌ కేసును బీఆర్‌ఎస్‌ పార్టీపై రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం మీ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనం.

నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచనను నేను స్వాగతిస్తున్నా. అందరికీ మనమే ఆదర్శంగా నిలుద్దాం. అంతేకానీ.. ప్రతి డ్రగ్స్‌ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటా..’అని కేటీఆర్‌ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement