అమ్మా.. ఎందుకిలా..! | Yadadri Bhuvanagiri District Incident | Sakshi
Sakshi News home page

అమ్మా.. ఎందుకిలా..!

Mar 16 2026 7:30 AM | Updated on Mar 16 2026 8:16 AM

 Yadadri Bhuvanagiri District Incident

పిల్లలతో కలిసి తనువు చాలిస్తున్న తల్లులు

ఇటీవల రైలుకు ఎదురెళ్లి ఇద్దరు  పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకున్న మరో మహిళ 

తాజాగా జైనపల్లిలో కూతురును చంపి ఆత్మహత్యకు యత్నించిన తల్లి

నెలన్నర వ్యవధిలో మూడు ఘటనలు

భువనగిరి : కుటుంబాలలో నెలకొనే చిన్నచిన్న తగాదాలు, సమస్యలతో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో తమతో పాటు నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డలను సైతం చంపుతున్నారు.  ఫలితంగా వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ట్రైన్‌కు ఎదురెళ్లి దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలను ఊపిరాగకుండా చేసి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరవకముందే  తాజాగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలపై కత్తితో దాడికి పాల్పడి తాను ఆత్మహత్య చేసుకుంది. నెలన్నర వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ మూడు ఘటనల్లో బాధితులు బీబీనగర్‌ మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. 

పిల్లలపై కత్తితో దాడి చేసి..
బీబీనగర్‌ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జం నరేందర్‌రెడ్డి భార్య రత్నకళ (నీలిమ) మానసిక స్థితి సరిగా లేక పిల్లలతో తల్లిగారి గ్రామమైన భువనగిరి మండలం తుక్కాపురానికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున నిద్రలో ఉన్న కుమార్తె కృతిరెడ్డి(14)పై కత్తితో దాడి చేసి చంపింది. అనంతరం పన్నెండేళ్ల కుమారుడి అక్షిత్‌రెడ్డిపై దాడికి యత్నంచగా అతడు తప్పించుకుని కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చాడు. అనంతరం ఆమె అదే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. ఈ ఘటన బీబీనగర్‌ మండలంలో కలకలం సృష్టించింది.

గతంలో రెండు ఘటనలు ఇలా..
అయితే బీబీనగర్‌ మండల కేంద్రానికి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి అనే మహిళ జనవరి 31న ఘట్కేసర్‌ వద్ద తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్‌రెడ్డితో కలిసి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే ఈ నెల 2న ఇదే మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మహిళ ఐశ్వర్య కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలైన ఝాన్సీ, పండును ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత తాను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెలన్నర వ్యవధిలోనే ఒకే మండలానికి ఇద్దరు మహిళలు తమ పిల్లలను చంపి తాము చావాలనుకోవడం లాంటి ఘటనలు మరువక ముందే ఇదే మండలానికి చెందిన తమ  మరో మహిళ తన తల్లి గారి ఊరిలో తన కుమార్తెను చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం చర్చనీయాంశంగా మారింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement