రికార్డు స్థాయికి చికెన్ ధరలు | chicken prices hike in telangana | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయికి చికెన్ ధరలు

Mar 16 2026 7:37 AM | Updated on Mar 16 2026 7:37 AM

chicken prices hike in telangana

రూ.300 దాటిన కిలో చికెన్‌

ఎండల కారణంగా మార్కెట్‌లో తగ్గిన కోళ్ల సంఖ్య

శుభకార్యాలు, రంజాన్‌ మాసంతో పెరిగిన చికెన్‌ వినియోగం

నల్లగొండ టూటౌన్‌ : చికెన్‌ ధర కొండెక్కింది. కిలో రూ.300 దాటింది. వేసవికాలం కావడం.. ప్రస్తుత సీజన్‌లో శుభాకార్యాలు అత్యధికంగా ఉండడం, రంజాన్‌ మాసం కావడంతో చికెన్‌ వినియోగం పెరిగింది. దీంతో చికెన్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత ఆదివారం రూ.250 ఉన్న కిలో చికెన్‌.. ఇప్పుడు రూ.300లకు చేరింది. ధరల పెరుగుదలతో వ్యాపారం తగ్గిందని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. 

రూ.100 పెరుగుదల..
చికెన్‌ ధర సాధారణంగా రూ.180 నుంచి రూ.220 మధ్య ఉంటుంది. కానీ కొంతకాలంగా ధరల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటీవలే ఒక్కసారిగా దాదాపు రూ.100 పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తగ్గిన కోళ్ల ఫారాలు
గతంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఇటీవల చౌటుప్పల్, స్థానికంగా గ్రామాల్లో ఉండే కోళ్ల ఫారాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. గ్రామాల్లో యువత ఉపాధి కోసం గతంలో కోళ్ల ఫారాలు పెట్టేవారు. కానీ సరైన ఆదాయం రాకపోవడం, వాటి నిర్వహణలో అనుభవం లేకపోవడం, మార్కెటింగ్‌ తదితర కారణాలతో గ్రామాల్లో కోళ్ల ఫారాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మరోవైపు ఎండల తీవ్రగా కారణంగా కోళ్లు చనిపోతాయని వ్యాపారులు ఫారాల్లో కోళ్లను పెంచడంలేదు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటుండడంతో రవాణా ఖర్చుల పెరగడం, కోళ్లు సరిపడ లేకపోవడం కూడా చికెన్‌ ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.

ఎండలతో కోళ్లు 
తక్కువగా ఉన్నాయి
ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత ఏటా ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలా మంది కోళ్లు చనిపోతాయని ఈ కాలంలో కోళ్ల పెంపకం తగ్గించారు.  అందువల్ల ధరలు పెరిగాయి. ప్రతి ఎండాకాలంలో ఈ సమస్య ఉంటుంది. ఎండలు తగ్గాక కోళ్లను పెంచడం మొదలు పెడుతారు. 
– వింజమూరి లక్ష్మణ్, చికెన్‌ దుకాణాల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement