breaking news
T bjp
-
రేపు బీజేపీ తొలి జాబితా?
సాక్షి. హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముంది. బుధవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఒకవేళ అవకాశం ఉంటే బుధవారం రాత్రే జాబితా ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా... ఏకాభిప్రాయం కుదిరిన సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 35–40 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తంగా ఇతర పార్టీల కంటే కూడా బీసీలు (దాదాపు 40 సీట్లు), మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముంనే చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోకు ఓపిక పట్టండి అధికార బీఆర్ఎస్ 98 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 55 మందితో తొలిజాబితా ప్రకటించేసింది. అదీగాక ఈ రెండు పార్టీలు మేనిఫెస్టోను సైతం ప్రకటించి ప్రచారంలో ముందున్న నేపథ్యంలో బీజేపీ ఇంకా తొలి జాబితాను కూడా ప్రకటించకపోవడంపై పార్టీ నాయకుల్లో ఒకింత ఆందోళన ఉంది. అదీగాక మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో దిగాలు చెందుతున్నారు. ఆయా అంశాలను కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా... ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. మేనిఫెస్టోలో ప్రతిపాదించే విషయాలను రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించాక... వారే ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే దానిపై స్పష్టతనిస్తారని చెబుతున్నారు. మేనిఫెస్టో ప్రకటనతోపాటే అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం విస్తృతంగా చేపట్టేలా ఢిల్లీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, బీసీలకు తగిన గుర్తింపు, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు తదితర అంశాలపై దృష్టి సారించినట్టు తెలిసింది. సకల జనుల ద్రోహి పేరుతో... కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారంటూ ‘సకల జనుల ద్రోహి కేసీఆర్’ పేరిట ఎన్నికల ప్రచారం చేపట్టాలని కమలం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. మంగళవారం రాష్ట్ర పార్టీ ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ సమక్షంలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి తదితరులు ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు భిన్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా కొత్తపంథాలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 14 కమిటీల (మేనిఫెస్టో, క్యాంపెయిన్, సోషల్ ఔట్రీచ్, స్క్రీనింగ్ తదితరాలు) సమావేశాలతో పార్టీ కార్యాలయమంతా సందడి నెలకొంది. మేనిఫెస్టో, అభ్యర్థుల స్క్రీనింగ్, క్యాంపెయిన్, ఎన్నికల మేనేజ్మెంట్ తదితరాలపై చర్చించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తోంది. -
TS Politics: బీసీ రూట్లో బీజేపీ!
ప్రధాని మోదీ బీసీ అంటూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘బీజేపీ జెండా.. బీసీలకు అండ’ నినాదంతో ముందుకెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. బీసీ అయిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారని.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, గతంలో కర్ణాటక సీఎంగా పనిచేసిన బీఎస్ యడ్యూరప్ప తదితరులు వెనుకబడిన వర్గాల వారేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర పార్టీలోనూ బీసీ నేతలకు కీలక పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ బీసీలకు అండగా నిలిచేది, అవకాశాలు ఇచ్చేది బీజేపీనే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తు న్నట్టు వివరిస్తున్నారు. బీసీల ఓటును కూడగట్టడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ రూట్లో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యమిస్తూ కొత్త ప్రయోగానికి దారులు వేస్తోంది. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం, అధికారంలో తగిన వాటా, గుర్తింపుతోపాటు అన్ని కలసి వస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఆ వర్గాలకు చెందిన వారినే కూర్చోబెట్టాలని భావిస్తున్నట్టు బీజేపీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేకపోవడంతో.. ఎన్నికల సమరం ముగిసేదాకా బీసీ సీఎంను ప్రకటించడం జరగకపోవచ్చని ఆ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. ఎస్సీ 19, ఎస్టీ 12 రిజర్వ్డ్ సీట్లు పోగా, మిగతా 88 సీట్లలో 40కిపైగా సీట్లను బీసీలకు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి. వెనుకబడిన వర్గాలను ఆకర్షించేలా.. రాష్ట్ర జనాభాలో 50శాతానికిపైగా బీసీలు ఉండటంతోపాటు ఎస్సీ, ఎస్టీలనూ కలిపితే 85శాతానికి పైగా వెనుకబడిన వర్గాల వారే ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆ వర్గాల ఓట్లను సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని వివరిస్తున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్ రెండూ అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉన్నాయని.. వాటిలో ఏది అధికారంలోకి వచ్చినా బీసీలకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. వారు బీసీని సీఎం చేయడం కాదుగదా.. కేబినెట్లోనూ తగిన అవకాశాలు కల్పించడం కష్టమేనని చెప్తున్నారు. ఆ పార్టీలు ఇటు రాష్ట్రస్థాయిలో, అటు జాతీయ స్థాయిలో ఎక్కడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని పేర్కొంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచాక టీఆర్ఎస్ కేబినెట్లలో బీసీవర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించిన దాఖలాలు లేవని.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన వాటా కల్పించలేదని విమర్శిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కల్పన, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర పథకాలు సరిగా అమలు కాలేదని.. బీసీ బంధు అమలు కూడా నామమాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు వివరించేలా ప్రచారం చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని చెప్తున్నారు. బీసీలలో బీజేపీ పట్ల విశ్వాసాన్ని కల్పించేలా అసెంబ్లీ ఎన్నికల్లో 40కిపైగా సీట్లు కేటాయించాలని నిర్ణయానికి వచ్చారని వివరిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవకాశాలు వివరిస్తూ.. బీసీల కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా బీసీ అయిన ప్రధాని మోదీ సారథ్యంలో.. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీలకు ప్రాతినిధ్యం, దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీసీల కోసం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు.. చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడిన ఎంబీసీల కోసం పీఎం విశ్వకర్మయోజన పథకం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, సదుపాయాల కల్పన వంటివి చేపట్టినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ చర్యల ద్వారా జాతీయ స్థాయిలో బీసీల మద్దతు కూడగట్టగలిగామని.. తెలంగాణలోనూ ఈ ఎజెండాతో ముందుకు తీసుకెళ్లాలని నాయకత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. ఇక రాష్ట్ర పార్టీలోనూ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ ఎంపీగా కె.లక్ష్మణ్‌కు అవకాశం కల్పించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం, అధ్యక్ష పదవి మార్పు తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌కు పార్టీ చేరికల కమిటీ కన్వీనర్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియామకం, ఎంపీగా ధర్మపురి అర్వింద్‌కు అవకాశం వంటి వాటిని వివరిస్తున్నారు. బీసీ నేతలను ముందు నిలిపి.. ఇప్పటికే రాష్ట్రంలో బీసీలను ఆకట్టుకునేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణను లక్ష్మ ణ్, సంజయ్, ఈటల తదితరులకు బీజేపీ అప్పగించింది. ఆయా కుల సంఘాలు, వర్గా ల వారీగా పార్టీ సదస్సులు, సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు బీసీ నేతలను ముందు నిలిపి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీసీ వర్గాలకు జరిగిన అన్యాయం, వారు నిర్లక్ష్యానికి గురైన తీరును గణాంకాలతో సహా ప్రజలకు వివరించాలని.. ఇదే సమ యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను భావిస్తోంది. -
టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్ : గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులను దారి మళ్లీస్తున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని కొంపల్లిలో బీజేపీ కార్యవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి జి.కిషన్‌రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీఆర్ఎస్పై జి.కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరవు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ఈ కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు హాజరయ్యారు. -
విలీనమా! విమోచనమా?