
సాక్షి, హైదరాబాద్: పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందన్న పల్లా.. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్ ఆదేశాలే మాకు శిరోధార్యం’’ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తేల్చి చెప్పారు.
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేపీ వివేకానంద
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్‌ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ‘‘గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కవిత అయోమయానికి గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని గతంలోనే కేసీఆర్ చెప్పారు.
..కన్నకూతురు కంటే కూడా కష్టంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్త్ ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. ఈ రోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని వివేకానంద పేర్కొన్నారు.
కాగా, హరీష్‌రావు, సంతోష్‌రావులు అవినీతి అనకొండలన్న కవితపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్‌ఎస్ ఆఫీస్‌ల్లొ కవిత ఫ్లెక్సీలను తొలగించారు.