
నాడు ఎల్కతుర్తి సభపై కేసీఆర్‌కు లేఖ రాసిన కవిత
లేఖ లీక్ కావడంతో బీఆర్‌ఎస్‌లో కలకలం
4 నెలలుగా పార్టీ కీలక నేతలే లక్ష్యంగా వ్యాఖ్యలు
సోదరుడు కేటీఆర్‌పైనా పరోక్ష విమర్శలు.. తాజాగా కాళేశ్వరంపై హరీశ్, సంతోష్ లక్ష్యంగా ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభపై చేసిన వ్యాఖ్యలతో.. తొలిసారి ఎమ్మెల్సీ కవిత తన అసంతృప్త స్వరాన్ని విన్పించారు. తన తండ్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు మే 5న కవిత రాసిన లేఖ బయటకు రావడం, ఆ లేఖలో ఎల్కతుర్తి సభపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ ప్రసంగం ‘పంచ్ లేకుండా‘ ఉందని, బీజేపీపై స్పష్టంగా విమర్శలు చేయలేదని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయకపోవడానికి బీజేపీతో సంబంధమే కారణమై ఉండవచ్చని కార్యకర్తలు భావించారని పేర్కొన్నారు. కాగా ఈ లేఖ ఎవరు బహిర్గతం చేశారనే చర్చ జరగ్గా, బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలను లేఖ బయటపెట్టిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
మీడియాకు లేఖ లీక్‌పై సంచలన వ్యాఖ్యలు
అమెరికా పర్యటన నుంచి మే 29న తిరిగి వచ్చిన కవిత శంషాబాద్ విమానాశ్రయంలో లేఖ లీక్ వెనుక పార్టీ లోపలి వ్యక్తులే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న కోవర్ట్‌లు పార్టీని బలహీనం చేస్తున్నారని ఆరోపించారు. తాను జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదనలు వస్తే వ్యతిరేకించినట్లు వెల్లడించారు. మరోవైపు తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వ శైలిని కూడా పరోక్షంగా విమర్శిస్తూ పార్టీ ట్విట్టర్‌కు పరిమితం కావద్దని అన్నారు. తాను కొత్తగా పార్టీ పెట్టే అవకాశాన్ని ఆమె ఖండించకపోవడం అప్పట్లోనే ఊహాగానాలకు తెర లేపింది.
పార్టీ నేతలపైనా ధ్వజం
కేటీఆర్‌పై పరోక్ష విమర్శలు గుప్పించిన కవిత పార్టీతోనూ అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా గత నెల 9న కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం విభేదాలను మరింత స్పష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నేత కార్తీక్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ బలహీనంగా ఉండటానికి జగదీశ్‌రెడ్డే బాధ్యుడని ఆమె పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే గత నెల 16న కవిత అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో.. సింగరేణి కాలరీస్‌లో బీఆర్‌ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. దీనిపై కవిత తీవ్రంగా స్పందిస్తూ, తన లేఖ లీక్‌లో పాల్గొన్న ‘కుట్రదారులు‘ తనను హింసిస్తున్నారని ఆరోపించారు. ఇక సోమవారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ కారణమని ఆరోపించడంతో పార్టీలో కలకలానికి కారణమయ్యారు.
కవిత కేంద్రంగా వివాదాలు
2023లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కవిత కేంద్రంగా వివాదాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 2023 మార్చి 11, 21 తేదీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను ప్రశ్నించింది. ఆమె సౌత్ గ్రూప్‌లో భాగమైనట్లు ఈడీ ఆరోపించింది. అయితే కవిత.. తనపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో తనిఖీలు చేసిన ఈడీ మార్చి 15న ఆమెను అరెస్టు చేసింది. సుమారు ఐదున్నర నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన కవిత తనను రాజకీయ కారణాలతో అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న కవిత.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ఈ ఏడాది జూన్‌లో ఆందోళనలు నిర్వహించారు.