
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కీలక భేటీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న చర్చల దృష్ట్యా కవితపై చర్చలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.
కాళేశ్వరంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి హరీష్‌రావు, సంతోష్‌రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల తర్వాత నిన్న సాయంత్రం నుంచి కీలక నేతలతో సమావేశం జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు యూకే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.
నిన్న అర్ధరాత్రి ఫామ్‌హౌజ్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్ ఈ ఉదయం మళ్లీ అక్కడకు చేరుకున్నారు. కేటీఆర్‌తో పాటు జగదీష్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. కవిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్లతో పాటు కేడర్ కూడా గుర్రుగా ఉంది. మొన్నీమధ్యే బహిరంగ లేఖ పేరిట కేటీఆర్ పైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో కవితపై కేసీఆర్ చర్యలకు సిద్ధమవుతున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే వ్యాఖ్యలకుగానూ షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేదంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా?.. చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ.. వేటు వేస్తే తలెత్తే పరిణామాలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి బీఆర్‌ఎస్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఒకవేళ కవితపై వేటు పడితే.. జాగృతిలో ఉన్న బీఆర్‌ఎస్ నేతలు ఎటు వైపు ఉంటారు? అనే కోణంలోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం నివేదిక.. సీబీఐ విచారణకు ఆదేశం దరిమిలా బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో హరీష్‌రావుపై వ్యాఖ్యలకు నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్దం చేయడం గమనార్హం.