
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో టీబీజీకేఎస్ ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధం. రాజకీయ కారణాలతోనే టీబీజీకేఎస్ ఎన్నిక. కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు’’ అంటూ కవిత మండిపడ్డారు.
‘‘గతంలో కేసీఆర్‌కు రాసిన లేఖలు లీక్ చేసి కుట్రలు చేశారు. పార్టీ వ్యవహారాలను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధిస్తున్నారు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. ‘‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను.
..ఈ పదేళ్ల కాలంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా, ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోంది’’ అంటూ లేఖలో కవిత పేర్కొన్నారు.
కాగా, కవితకు బీఆర్ఎస్ హైకమాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడి పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. గురువారం ఉదయం సింగరేణి కార్మికులకు బహిరంగ లేఖ రాశారు.