మూసీ, ఈసా, గోదావరి నదుల సంగమమిదీ..
ఇక్కడే ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్ముడి కాంస్య విగ్రహం
బాపూ తత్వాలను బోధించేందుకు ఆశ్రమం, మ్యూజియం కూడా
మూసీ వెంట రాష్ట్ర, జాతీయ స్థాయి మహనీయుల విగ్రహాల ఏర్పాటు
సర్వమతాల సమ్మేళనంగా మూసీ అభివృద్ధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా అడుగులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి వడ్డాణంలా.. నడిమధ్యలో వయ్యారంగా ప్రవహించే మూసీ నది పునరుజ్జీవానికి అందమైన సొబగులు అద్దుకుంటున్నాయి. మూసీని వాణిజ్య కేంద్రంగానే కాకుండా.. నదీ పరీవాహక ప్రాంతాన్ని సాంస్కృతిక ఆలవాలంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఈమేరకు మూసీ, దాని ఉపనది ఈసా నదుల సంగమం అయిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడే ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు గాంధీ తత్వాన్ని బోధించే ఆశ్రమం, మ్యూజియంను కూడా నిర్మించనున్నారు.
సమగ్ర మాస్టర్‌ప్లాన్ త్వరలోనే ప్రభుత్వానికి..
మెయిన్‌హార, కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్, ఆర్‌ఐఓఎస్, జెడ్‌హెచ్‌ఏ, ఎస్‌ఓఎంలతో కూడిన కన్సార్టియం తొలి దశ మూసీ సుందరీకరణ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అతి త్వరలోనే ప్రభుత్వానికి సమరి్పంచనుంది. గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం 250 ఎకరాల భూమి అవసరం కాగా.. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అ«దీనంలో ఉన్న ఈ భూములను బదిలీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికే కేంద్రం 100 ఎకరాల భూమిని బదిలీ చేసేందుకు కేంద్రం అంగీకరించగా.. మిగిలిన భూమి కోసం చర్చలు జరుగుతున్నాయని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) అధికార వర్గాలు తెలిపాయి.
సాంస్కృతిక పునరుజ్జీవంగా..
తొలి దశలో గండిపేట నుంచి బాపూ ఘాట్ వరకూ 20.5 కిలో మీటర్ల వరకు మూసీకి పునరుజ్జీవం కల్పించనున్న అధికారులు.. రెండో దశలో హెచ్‌ఎండీఏ పరిధిలోని 55 కి.మీ. వరకూ నదిని సుందరీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మూసీకి వాణిజ్య, ఉపాధి కేంద్రంతో పాటు సాంస్కృతిక పునరుజ్జీవంగా అభివృద్ధి చేయనున్నారు. నదీ పరీవాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, షాపింగ్ మాల్స్, యాంపి థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేయడంతో పాటు నదీ పరీవాహక ప్రాంతం వెంబడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన వ్యక్తులు, మహనీయుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
సకల మతాల సమ్మేళనంగా..
నగరం మధ్యలో నుంచి 55 కి.మీ. మేర ప్రవహించే మూసీ పరీవాహక ప్రాంతాన్ని సకల మతాల సమ్మేళనంగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మంచిరేవులలో 800 ఏళ్ల నాటి పురాతన శివాలయం, పాతబస్తీలోని మసీదు, సిఖ్‌చౌనిలో గురుద్వార, ఉప్పల్‌లో మెదక్ కేథడ్రిల్ తరహాలో చర్చిని కూడా నిర్మించనున్నారు. బాపూ ఘాట్‌ను అభ్యాస ప్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గాంధీ ఆశ్రమం, మ్యూజియంలను నిర్మించనున్నారు. ఇందులో గాంధీ బోధనలను నుంచి ప్రేరణ పొందిన నీతి, కమ్యూనికేషన్, విలువలపై కోర్సులను అందిస్తారు.
దండియాత్ర విగ్రహమే.. మూసీ, ఈసా నదుల
సంగమమైన బాపూఘాట్ వద్దకు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి.. ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడే ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశ, విదేశాల్లో కొలువుదీరిన మహాత్మా
గాంధీ విగ్రహాలను అధ్యయనం చేసిన అధికారులు.. చరిత్రాత్మక దండి యాత్రలో చేతిలో కర్రతో నడుస్తున్న స్థితిలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. అహింసా, ప్రతిఘటన, స్వావలంబన, స్వేచ్ఛను సాధించే సమష్టి శక్తికి ఇది సూచిక. గాం«దీజీ నిశ్శబ్ద బలమైన వాకింగ్ స్టిక్.. శ్రద్ధ, దృఢత్వాన్ని సూచిస్తుంది. ఇప్పటికే 68 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బాపూఘాట్‌లో ధ్యాన భంగిమలో ఉన్న 22 అడుగుల ఎత్తయిన గాంధీ విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని 1999లో ఏర్పాటు చేశారు.